దాతలు ఉన్నా... క్లోమం తీయట్లే.. రిస్క్ సాకుతో పాంక్రియాస్ సేకరించని డాక్టర్లు

దాతలు ఉన్నా... క్లోమం తీయట్లే..  రిస్క్ సాకుతో పాంక్రియాస్ సేకరించని డాక్టర్లు
  • నిరుడు 205 మంది దాతలున్నా.. ఒక్కటీ తీసుకోలే
  • 13 ఏండ్లలో సేకరించింది 14 మాత్రమే..
  • టైప్-1 డయాబెటిస్ పిల్లలకు తప్పని ఇబ్బందులు
  • పొరుగు రాష్ట్రాల్లో వందల సర్జరీలు.. మన దగ్గరేమో ముఖం చాటేస్తున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి గుండె, లివర్, కిడ్నీలను పోటీపడి మరీ సేకరిస్తున్న కార్పొరేట్, ప్రభుత్వ డాక్టర్లు.. పాంక్రియాస్ (క్లోమ గ్రంథి) వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా విలువైన అవయవాలు మట్టిలో కలిసిపోతుంటే మరోవైపు జీవితాంతం ఇన్సులిన్ ఇజెక్షన్లతో టైప్-1 డయాబెటిస్ బాధితులు నరకం అనుభవిస్తున్నారు. పక్కనున్న మహారాష్ట్ర, తమిళనాడులో వందల సంఖ్యలో పాంక్రియాస్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లు జరుగుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం ఇన్ఫెక్షన్ రిస్క్ అనే సాకుతో డాక్టర్లు సర్జరీలకు వెనకడుగు వేస్తున్నారు. జీవన్‌‌‌‌దాన్ 13 ఏండ్ల చరిత్రలో వేల సంఖ్యలో అవయవాలు సేకరించినా.. పాంక్రియాస్ సంఖ్య మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టేలా ఉండటం గమనార్హం. ఫలితంగా చిన్నతనం నుంచి డయాబెటిక్ టైప్ 1 ఉన్న పిల్లలు ఇన్సులిన్ నొప్పి భరిస్తూ... జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి నెలకొన్నది.

ఇతర అవయవాలు తీసుకొని..

జీవన్‌‌‌‌దాన్ లెక్కల ప్రకారం.. 2013 నుంచి 2025 వరకు మొత్తం 1,755 మంది దాతల నుంచి 6,617 అవయవాలు సేకరించారు. ఇందులో 2,618 కిడ్నీలు, 1,607 లివర్లు ఉంటే.. సేకరించిన పాంక్రియాస్‌‌‌‌ల సంఖ్య కేవలం 14 మాత్రమే. మరీ ముఖ్యంగా గతేడాది జీవన్‌‌‌‌ దాన్ చరిత్రలోనే అత్యధికంగా 205 మంది ఆర్గాన్ డొనేషన్ చేశారు. కానీ, వారి నుంచి ఒక్కటంటే ఒక్క పాంక్రియాస్‌‌‌‌ను కూడా డాక్టర్లు సేకరించలేదు. దాతలు సిద్ధంగా ఉన్నా.. డాక్టర్ల నిర్లక్ష్యంతో 205 మంది పేషెంట్లకు దక్కాల్సిన పాంక్రియాస్ మట్టిపాలైంది. ఇక ఈ 13 ఏండ్లలో సర్కార్ దవాఖానల్లో చేసింది కేవలం ఒక్కటంటే ఒక్క సర్జరీనే అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రిస్క్ సాకుతో డాక్టర్ల వెనకడుగు

పాంక్రియాస్ అత్యంత సున్నితమైన అవయవం కావడంతో.. దీన్ని సేకరించాలన్నా, ట్రాన్స్ ప్లాంట్ చేయాలన్నా డాక్టర్లు రిస్క్ సాకుతోనే వెనకడుగు వేస్తున్నారు. క్లోమం నుంచి విడుదలయ్యే ఎంజైమ్స్ సర్జరీ టైమ్​లో ఏమాత్రం లీక్ అయినా.. పక్కన ఉండే పేగులు, ఇతర అవయవాలకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకి, సెప్సిస్‌‌‌‌ గా మారి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుందనేది డాక్టర్ల ప్రధాన భయం. కిడ్నీ, లివర్ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్‌‌‌‌ లతో పోలిస్తే పాంక్రియాస్ సర్జరీలో సాంకేతిక సవాళ్లు ఎక్కువని, సర్జరీ ఫెయిల్ అయితే హాస్పిటల్ కు చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో కార్పొరేట్, ప్రభుత్వ డాక్టర్లు అసలు ఆ జోలికే పోవడం లేదని విమర్శలు ఉన్నాయి. 

పాంక్రియాస్ కోసం16 మంది ఎదురుచూపు..

జీవన్‌‌‌‌దాన్ లిస్టులో ప్రస్తుతం పాంక్రియాస్ కోసం 16 మంది ఎదురుచూపులు చూస్తున్నరు. కానీ, ఇది ప్రభుత్వ లెక్కల్లో కనిపిస్తున్న సంఖ్య మాత్రమే.. అసలు వాస్తవం వేరే ఉంది. రాష్ట్రంలో వందల మంది బాధితులు ఉన్నా.. ఎలాగూ ఆపరేషన్లు చెయ్యరు కదా.. ఇక రిజిస్ట్రేషన్ ఎందుకు అనే నిరాశతో చాలామంది పేర్లు నమోదు చేసుకోవడానికే వెనకాడుతున్నారు. గతేడాది 205 మంది దాతలు ముందుకొచ్చినా, డాక్టర్లు ఒక్క పాంక్రియాస్‌‌‌‌ ను కూడా సేకరించకపోవడంతో.. లిస్టులో ఉన్న ఆ 16 మంది ఆశలు అడియాశలయ్యాయి.

ఎవరికి అవసరమంటే..?

ఈ క్లోమ గ్రంథి.. జీర్ణరసాలతో పాటు, రక్తంలో షుగర్ లెవల్స్‌‌‌‌ ను కంట్రోల్ చేసే ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కీలకమైన అవయవం. ఎప్పుడైతే ఇది పూర్తిగా చెడిపోతుందో.. అప్పుడు బాధితులు బయటి నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. దీనినే టైప్-1 డయాబెటిస్ అంటారు. చిన్నతనం నుంచే క్లోమం పనిచేయక జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్లపై బతికే వారికి ఈ ఆపరేషన్ సంజీవని లాంటిది.

రక్తంలో షుగర్ లెవల్స్ ఎప్పుడు పడిపోతున్నాయో తెలియక ఆకస్మికంగా స్పృహ కోల్పోతూ ప్రాణాపాయ స్థితికి వెళ్లే వారికి ఇది అత్యవసరం. డయాబెటిస్ ముదిరి కిడ్నీలు పాడైపోయిన బాధితులకు.. కేవలం కిడ్నీ మారిస్తే సరిపోదు. ఆ కొత్త కిడ్నీని కాపాడుకోవాలంటే కిడ్నీతో పాటే పాంక్రియాస్‌‌‌‌ ను కూడా అమర్చాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ జరిగితే ఆ రోగులు మళ్లీ ఇన్సులిన్ అవసరం లేకుండా సాధారణ జీవితం గడిపే అవకాశం దక్కుతుంది. 

ఆరోగ్యశ్రీలోనూ మొండిచేయి

గుండె, లివర్, కిడ్నీ మార్పిడికి ఆరోగ్యశ్రీ కింద లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. పాంక్రియాస్ కు మాత్రం మొండిచేయి చూపిస్తోంది. అత్యంత ఖరీదైన ఈ ఆపరేషన్ ప్రైవేటు హాస్పిటల్స్ లో చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. అంత డబ్బులు పెట్టుకోలేక, సర్కార్ సాయం అందక పేదోళ్లు ప్రాణాల మీద ఆశలు వదులుకుంటున్నరు.

కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్, ట్రాన్స్‌‌‌‌ప్లాంట్‌‌‌‌ కు నిధులిస్తున్న సర్కారు.. దానికి మూల కారణమైన షుగర్‌‌‌‌ ను కంట్రోల్ చేసే పాంక్రియాస్ ట్రాన్స్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ను మాత్రం ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చలేదు. దీంతో కార్పొరేట్ హాస్పిటల్స్ కు పోలేక, ప్రభుత్వ హాస్పిటల్స్ లో అవయవాలు సేకరించక... టైప్-1 డయాబెటిస్ బాధితులు నరకం చూస్తున్నారు.