- సామాజిక న్యాయానికి పెద్దపీట
- పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా పదవులు: మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన అధికార కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్ని. ఇప్పటికే 33 జిల్లాలకు డీసీసీలను నియమించగా.. తాజాగా 14 డీసీసీ కమిటీలను గురువారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇందులో ఖైరతాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మెదక్, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్, వనపర్తి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్ కార్పొరేషన్, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి.
మిగిలిన 19 జిల్లాలకు కమిటీలను ప్రకటించాల్సి ఉంది. ఇందులో సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు మాత్రం ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షులను కూడా నియమించలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించినా..ఈ రెండు జిల్లాలకు మాత్రం స్థానికంగా ఉన్న రాజకీయ ఒత్తిళ్లు, ఇతర సమీకరణల కారణంగా పెండింగ్ లో పెట్టారు.
పూర్తి స్థాయి కమిటీలు..
తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీల్లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉన్నారు. ప్రతి కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు పెద్దపీట వేశారు. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఈ కమిటీలను నియమించడంలో పీసీసీ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాత..కొత్త వారికి కూడా ఇందులో తగిన న్యాయం చేశారు. ప్రతి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి, ప్రతి మండలం నుంచి జిల్లా కమిటీలో ప్రాతినిథ్యం ఉండేలా చూశారు.
ఇప్పుడు ప్రకటించిన జాబితాలో ఖైరతాబాద్ జిల్లా కమిటీలో ఏకంగా 90 మందిని నియమించారు. ఇప్పటి వరకూ ఇదే జంబో కమిటీగా చెప్పవచ్చు. కాగా, జిల్లా కమిటీల్లో పదవులు పొందిన వారిని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అభినందించారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకాలం పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా జిల్లా కమిటీలో పదవులను ఇచ్చామని, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం మరింత కష్టపడుతారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.
