
ఎర్రుపాలెం, వెలుగు : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో టేకు చెట్లు కొట్టేందుకు పర్మిషన్అడిగితే లంచమడిగిన ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లను బుధవారం ఏసీబీ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణమూర్తి కథనం ప్రకారం..గంపలగూడానికి చెందిన కొండ అనూష..అమెరికాలో ఉంటున్నారు. ఆమెకు చెందిన మూడెకరాల టేకు తోటను అయ్యవారిగూడానికి చెందిన రామకృష్ణ చూసుకుంటున్నాడు. ఇందులో టేకు చెట్లను నరికేందుకు పర్మిషన్ కావాలని మార్చి10న దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతి ఇవ్వాలంటే రూ.70 వేలు ఇవ్వాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ జాన్ బాషా, ఐకేపీ సర్వేయర్ శేషయ్య డిమాండ్ చేశారు. కానీ, తాను పేదరైతునని చెప్పడంతో డిస్కౌంట్ ఇస్తామని చెప్పి బాషా రూ.7 వేలు, శేషయ్య రూ.3 వేలు తీసుకోవడానికి ఒప్పుకున్నారు. రామకృష్ణ ఏసీబీని ఆశ్రయించగా వారి సూచనలతో బాషా, శేషయ్యలతో లంచం గురించి మాట్లాడిన వీడియో రికార్డు చేశాడు. ఆ ఆధారాలను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయగా, అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో ఆర్ఐ బాషాను ఖమ్మంలోని అతడి ఇంటి వద్ద, శేషయ్యను ఖమ్మం కలెక్టరేట్ లోని సర్వే ఆఫీస్ కి వెళ్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో ఖమ్మం సీఐలు విజయ్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.