
ఆర్థిక, ఆహార సంక్షోభంతో అష్టకష్టాలు పడుతున్న పాకిస్థాన్ లో ధరల పెరుగుదలతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. తాజాగా పాక్ ప్రజలపై మరోసారి ధరల భారాన్ని మోపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ దేశంలో అనేక సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచగా...మరోసారి చమురు ధరలను పెంచేందుకు పాకిస్థాన్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
15 రోజుల్లో...
అమెరికా డాలరుతో పోల్చితే పాకిస్థాన్ రూపాయి మారకం విలువ రోజురోజుకీ పడిపోతుండడంతో పాక్ లో ధరలను పెంచక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందులో భాగంగానే రానున్న 15 రోజుల్లో పాక్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలపై రూ. 10 నుంచి రూ. -14 వరకు పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా నివేదించింది. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరుగుదల కారణంగానే పాక్ ప్రభుత్వం పెట్రోల్,డీజిల్ ధరలను పెంచబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పెట్రోల్ రేట్ ఎంత...
ప్రస్తుతం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 272 రూపాయలు. అయితే మరో 15 రోజుల్లో రూ. 14 పెరిగే అవకాశం ఉండటంతో పాక్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 286.77కు చేరుకుంటుంది. అటు జీరో జనరల్ సేల్స్ ట్యాక్స్‌తో పాక్ ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు 50 రూపాయల లెవీని వసూలు చేస్తోంది.
యూఏఈ సాయం..
ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్థాన్ 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగీకరించింది. ద్వైపాక్షిక ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు IMFకి వెల్లడించింది. డిఫాల్ట్‌ను నివారించడానికి ఈ ఒప్పందం పాకిస్థాన్‌కు కీలకం అని పాక్ మీడియా పేర్కొంది. ఈ అంశంపై పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ కు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు IMF కి వెల్లడించిందని మంత్రి తెలిపారు. ఈ సాయాన్ని అందుకునేందుకు యూఏఈ అధికారులకు అందించాల్సిన డాక్యుమెంటేషన్ పనిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ ప్రస్తుతం నిమగ్నమై ఉందని తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు చైనా నుంచి చివరి విడత సాయంగా 300 మిలియన్ డాలర్లను పొందనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇది చైనా బ్యాంక్స్ ICBC ఆమోదించబడిన $1.3 బిలియన్ల రుణ సదుపాయంలో భాగమన్నారు. దీనికి ముందు మార్చి 3న 500 మిలియన్ డాలర్లు.. మార్చి 17న 500 మిలియన్ డాలర్లను ICBC పాకిస్థాన్ కి అందించింది. ప్రస్తుతం పాక్ IMF నుంచి 1.1 బిలియన్ డాలర్ల విరాళాన్ని పొందేందుకు.. 7 బిలియన్ డాలర్ల బెయిలవుట్ కార్యక్రమాన్ని పునరుద్ధరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.