మెకాలే బానిస మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తి చేయండి: ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

మెకాలే బానిస మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తి చేయండి:  ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: మెకాలే బానిసత్వ మనస్తత్వం నుంచి దేశానికి విముక్తి కల్పించాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం అందరూ సంకల్పం తీసుకోవాలని సూచించారు. రాబోయే పదేండ్లు అత్యంత కీలకమని చెప్పారు. ఢిల్లీలో ‘రామ్‌‌‌‌నాథ్‌‌‌‌ గోయెంకా ఆరో స్మారకోపన్యాసం’ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ కీలక సూచనలు చేశారు. 

1835లో బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు థామస్ బాబింగ్టన్ మెకాలే.. భారత్‌‌‌‌ను దాని సొంత మూలాల నుంచి పెకిలించేందుకు ఒక భారీ ప్రచారాన్ని ప్రారంభించాడని గుర్తుచేశారు.‘‘భారతీయుడిలా కనిపించే శరీరం.. బ్రిటిషర్​ లా ఆలోచించే ఒకతరం భారతీయులను సృష్టిస్తాను’’ అని మెకాలే ప్రకటించాడని, అందుకు తగ్గట్టుగానే విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడని చెప్పారు. మన ఆత్మవిశ్వాసాన్ని చిన్నాభిన్నం చేసి, హీన భావాన్ని నింపాడని, ఒక్క దెబ్బతో మన జీవన విధానం మొత్తాన్ని చెత్తకుండీలో పడేశాడని అన్నారు. అప్పటినుంచే ‘‘ఏదైనా సాధించాలంటే విదేశీ మార్గాలు స్వీకరించాల్సిందే’’ అనే నమ్మకం మనలో పాతుకుపోయిందని చెప్పారు. 

స్వాతంత్ర్యం వచ్చాక ఈ మనస్తత్వం మరింత బలపడిందని, స్వదేశీ పట్ల గౌరవం క్షీణించిందని తెలిపారు. మెకాలే విద్యా విధానానికి 200 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగానైనా మనం ఈ మనస్తత్వం నుంచి బయటపడాలని సూచించారు. ఇందుకోసం పదేండ్ల రూట్‌‌‌‌మ్యాప్‌‌‌‌ను ప్రకటించారు. ఏ దేశం కూడా తమ మాతృ భాషను అవమానించుకోవని,  జపాన్, చైనా, దక్షిణ కొరియాలాంటి దేశాలు పాశ్చాత్య సంస్కృతిని, ఇతర అంశాలను స్వీకరించినా తమ మాతృభాషలపై రాజీపడలేదని మోదీ గుర్తుచేశారు. 

అందుకే కొత్త జాతీయ విద్యావిధానం(ఎన్‌‌‌‌ఈపీ) మాతృభాషల్లో విద్యపై ప్రత్యేక ఫోకస్​ పెట్టిందని చెప్పారు. ఇంగ్లిష్‌‌‌‌కు తమ ప్రభుత్వం వ్యతిరేకంకాదని, కానీ భారతీయ భాషలను గట్టిగా సమర్థిస్తుందని స్పష్టం చేశారు.  ‘కేంద్ర ప్రభుత్వమైనా, ప్రాంతీయ పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలైనా.. ప్రధానంగా వాటి దృష్టి అంతా అభివృద్ధిపైనే ఉండాలి. మంచి ఉద్దేశాలుంటే ప్రజలు విశ్వసిస్తారు. బిహార్‌‌‌‌ దీనిని మరోసారి దానిని రుజువు చేసింది” అని వివరించారు.