అమెరికా టూర్.. ఎలాన్ మస్క్ ను కలవనున్న ప్రధాని మోడీ

అమెరికా టూర్.. ఎలాన్ మస్క్ ను కలవనున్న ప్రధాని మోడీ

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధాని ఈరోజు న్యూయార్క్‌లో దిగిన తర్వాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను, మేధావులను కలవనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా సీఈవో, ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్‌తోనూ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు 2015లో కాలిఫోర్నియాలోని టెస్లా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శించిన సందర్భంగా ప్రధాని మస్క్‌ను కలిశారు. అప్పటికీ మస్క్‌ ట్విట్టర్‌ ఓనర్ కాదు.

ఇటీవలే భారత్ లో మస్క్.. టెస్లా మోటార్స్ ఫ్యాక్టరీని స్థాపించనున్నట్టు వార్తలు వచ్చాయి.  భారత మార్కెట్‌ను ఎలాగైనా కంపెనీ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని మస్క్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయమై టెస్లా అధికారులు, భారతీయ అధికారులతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అయితే టెస్లా కార్ల తయారీ ప్లాంట్ ను భారత్ లో ఎక్కడ నిర్మించనున్నారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఈ ఏడాది చివరి నాటి ఆ స్థలం ఎక్కడో ఖరారవుతుందని పలువురు భావిస్తున్నారు.

మస్క్‌తో పాటు రచయిత, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ టైసన్, ఆర్థికవేత్త పాల్ రోమర్, గణాంక నిపుణుడు నికోలస్ నాసిమ్ తలేబ్, పెట్టుబడిదారు రే డాలియో, భారతీయ-అమెరికన్ గాయకుడు ఫాలూ షా, రచయిత, పరిశోధకుడు జెఫ్ స్మిత్, మాజీ US వాణిజ్య ప్రతినిధి మైఖేల్ ఫ్రోమాన్, దౌత్యవేత్త డేనియల్ రస్సెల్, రక్షణ నిపుణుడు ఎల్బ్రిడ్జ్ కాల్బీ కూడా జాబితాలో ఉన్నారు. వీరిచో పాటు వైద్యులు, నోబెల్ గ్రహీత డాక్టర్ పీటర్ అగ్రే, ఆరోగ్య సంరక్షణ నిపుణుడు డాక్టర్ స్టీఫెన్ క్లాస్కో, భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్, కళాకారిణి చంద్రికా టాండన్‌లను కూడా ప్రధాని కలవనున్నారు.