అవినీతిపరులకు భయం.. అందుకే కొత్త బిల్లులను వ్యతిరేకిస్తున్నరు: మోదీ

అవినీతిపరులకు భయం.. అందుకే కొత్త బిల్లులను వ్యతిరేకిస్తున్నరు: మోదీ
  • 50 గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ జాబ్ పోతది 
  • మరి పీఎం, సీఎం, మంత్రులు ఎందుకు కొనసాగాలి? 
  • అవినీతిని అంతం చేసేందుకే ఈ బిల్లులు తెచ్చామన్న ప్రధాని

గయాజీ/ బెగుసరాయ్: కేవలం 50 గంటలు జైల్లో ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోతున్నప్పుడు.. పీఎం, సీఎం, మంత్రులు మాత్రం పదవుల్లో ఎలా కొనసాగుతారని ప్రధాని నరేంద్ర మోదీ  ప్రశ్నించారు. అవినీతిని అంతం చేయడానికే కొత్త బిల్లులను తీసుకొచ్చామని చెప్పారు. దీంతో అవినీతిపరులకు భయం పట్టుకుందని, అందుకే బిల్లులను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం బిహార్‌‌‌‌లో మోదీ పర్యటించారు. గయాజీ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి 50 గంటలు జైల్లో ఉంటే ఆటోమేటిక్‌‌గా ఉద్యోగం పోతుంది. కానీ జైల్లో ఉన్నా సరే పీఎం, సీఎం, మినిస్టర్లు మాత్రం తమ పదవుల్లో కొనసాగుతున్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని ఎందుకు అనుమతించాలి?” అని ప్రశ్నించారు. రాజకీయ నేతలు నైతిక విలువలతో ఉండాలని ప్రజలు ఆశిస్తారన్నారు.

చొరబాటుదారులతో దేశానికి ముప్పు..  

అవినీతిపై పోరాటంలో భాగంగానే కొత్త బిల్లులు తెచ్చామని మోదీ తెలిపారు. వీటి పరిధిలోకి ప్రధాని సైతం వస్తారని చెప్పారు. ‘‘బిల్లులను కాంగ్రెస్, ఆర్జేడీ వ్యతిరేకిస్తున్నాయి. వాటికి వాళ్లు ఎందుకు భయపడుతున్నారు? ఆర్జేడీ నాయకులు ఎల్లప్పుడూ అవినీతికి పాల్పడతారని బిహార్‌‌‌‌లో ప్రతి ఒక్కరికీ తెలుసు” అని అన్నారు. ‘‘జైల్లో ఉండే ఫైళ్లపై సంతకాలు చేస్తూ, అక్కడి నుంచే ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వాన్ని నడపడాన్ని కొంతకాలం క్రితం చూశాం. అలాంటి నేతలు ఉంటే ఇక అవినీతిపై ఎలా పోరాడగలం?” అని కేజ్రీవాల్‌‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ‘‘చొరబాటుదారులతో మన దేశానికి ముప్పు పొంచి ఉంది. వాళ్లను గుర్తించేందుకే బిహార్‌‌‌‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టాం. కానీ ఓటు బ్యాంకు కోసం ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి” అని మండిపడ్డారు.

కోల్‌‌కతాలో మైట్రో రూట్ల ప్రారంభం.. 

పశ్చిమ బెంగాల్‌‌లోని కోల్‌‌కతాలో మూడు కొత్త రూట్లలో మెట్రో లైన్లు నిర్మించగా.. ఆయా మార్గాల్లో రైళ్లను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు.

తువ్వాల ఊపుతూ అభివాదం 

బిహార్‌‌‌‌లోని గయాజీ, బెగుసరాయ్ జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా రూ.13 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బెగుసరాయ్‌‌లో గంగా నదిపై నిర్మించిన బ్రిడ్జిని బిహార్ సీఎం నితీశ్ కుమార్‌‌‌‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మోదీ తన మెడలోని తువ్వాల తీసి ఊపుతూ.. బ్రిడ్జి పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. 1.86 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని బెగుసరాయ్‌‌ నుంచి పాట్నాలోని మోకమాను కలుపుతూ రూ.1,870 కోట్లతో నిర్మించారు.