ఏజెన్సీలో దోమతెరలు ఇస్తలేరు..

ఏజెన్సీలో దోమతెరలు ఇస్తలేరు..
  • రెండేళ్లుగా సప్లై బంద్ చేసిన అధికారులు
  • ఆసిఫాబాద్​జిల్లాలో దోమల వల్ల పెరుగుతున్న విష జ్వరాలు
  • వందల సంఖ్యలో మంచంపడుతున్న  పల్లె జనం
  • చనిపోతున్న చిన్నారులు  
  •  మలేరియా కేసులు నమోదైతేనే ఇస్తామంటున్న ఆఫీసర్లు

ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ పల్లెల్లో దోమలు ఆదివాసీల  కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వానలకు విపరీతంగా పెరిగి  పొద్దు, మాపు తేడా లేకుండా ప్రజల రక్తం పీల్చేస్తున్నాయి. దీంతో  ఆదివాసీలు వందల సంఖ్యలో మంచం పడుతున్నారు. వానాకాలం వచ్చిందంటే గతంలో ఏటా క్రమం తప్పకుండా దోమతెరలు పంపిణీ చేసేవారు. కానీ రెండేళ్లుగా ఆ విషయం పట్టించుకుంటలేరని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పారిశుధ్య సిబ్బంది  డ్రై డే , ఫ్రై డే లు చేపట్టినా దోమలను కంట్రోల్​చేయలేకపోతున్నారు.  
 కరెంటు, ఫ్యాన్లు లేక..
ఏజెన్సీలో దోమలు రాత్రి వేళల్లోనే పరేషాన్ చేసేవి. కానీ ఇండ్లల్లో కరెంటు, ఫ్యాన్లు లేకపోవడంతో పగలు రాత్రి తేడా లేకుండా విపరీతంగా కుడుతున్నాయి. దీంతో ఆదివాసీలు రోజూ మూడు పూటలు ఇండ్లల్లో పొగబెట్టి దోమలను తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దోమల బెడద తగ్గకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  
దోమ తెరల పంపిణీ ఎప్పుడో.. 
గ్రామాల్లో దోమ తెరలు ఎప్పుడు పంచుతారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రభుత్వం క్రమం తప్పకుండా దోమ తెరలు పంపిణీ చేసేది. కానీ  రెండేళ్లుగా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం లేదు. మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లోనే దోమ తెరలు అందిస్తామని వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు.  సాధారణంగా గ్రామాల్లో జ్వరం వస్తే వైద్య పరీక్షలు చేయించుకోవడం అందరికీ సాధ్య పడని విషయం. దీంతో అందుబాటులో ఉన్న మందులు వేసుకుని తర్వాత జ్వరం తగ్గకపోతే రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. మలేరియా జ్వరం వచ్చిన రోగి ముందుగా వాడిన మందుల కారణంగా మలేరియా కేసుగా రికార్డు కాదనీ ల్యాబ్ టెక్నీషియన్లు పేర్కొంటున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న వైద్యారోగ్యశాఖ  అధికారులు  మలేరియా జ్వరాలు లేవని చెపుతుండడం గమనార్హం. 
దోమల బాధ తట్టుకోలేక పోతున్నం
రోజు రోజుకు దోమల బెడద విపరీతంగా పెరుగుతోంది. రాత్రి, తేడా లేకుండా కుడుతున్నాయి. రాత్రయితే చాలు జాగారం చేయాల్సి వస్తోంది. రోజూ  మూడు సార్లు పసరు పొగబెడుతున్నాం. దోమ కాటుతో విష జ్వరాల బారిన పడుతున్నం.  ప్రభుత్వం వెంటనే దోమ తెరలు అందించాలి. - కొడప లింబరావు, మార్లవాయి

దోమ తెరలు ఇవ్వాలి
యేటా దోమతెరలు ఇచ్చేవారు.. కానీ ఈ యేడు ఇంకా ఆ ఊసే లేదు. దోమ తెరలు చిన్నపిల్లలకు ఎంతో  ఉపయోగపడుతాయి. గతంలో అధికారులు ఇండ్లల్లో స్ప్రై,  మందులు చల్లేవారు. కానీ ఇప్పుడు అవి కూడా చేస్తలేరు. చేస్తే  చేస్తే కొంత దోమల బెడద తగ్గించొచ్చు.  ఇప్పటికైనా శానిటేషన్ ​అధికారులు దోమల కంట్రోల్​కు చర్యలు తీసుకోవాలి.  - కొడప ఆనంద్ రావు , జైనూర్
మలేరియా కేసులు ఉన్న చోటనే అందిస్తాం
మలేరియా కేసులు నమోదు అయిన గ్రామాల్లోనే దోమ తెరలు పంపిణీ చేస్తం. కేంద్ర ప్రభుత్వం నుంచి దోమ తెరలు వస్తాయి. మలేరియా కేసులు నమోదు అయిన చోటే వీటిని అందిస్తాం. ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్తగా ఎక్కడా సప్లై కాలేదు.  కరోనా టైం లో మిగిలిన 8 వేల దోమ తెరలను త్వరలోనే ఆశ్రమ పాఠశాల స్టూడెంట్లకు అందిస్తాం. -  ప్రభాకర్ రెడ్డి, డీఎంహెచ్ వో