ఆర్టీసీ కార్మికులకు త్వరలో శుభవార్త

ఆర్టీసీ కార్మికులకు త్వరలో శుభవార్త
  • సంస్థపై సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు: పొన్నం ప్రభాకర్ 
  • మంత్రిని కలిసిన ఆర్టీసీ టీఎంయూ, ఈయూ నేతలు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు అంతా మంచే జరుగుతుందని, త్వరలో శుభవార్త వింటారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేస్తామని, సంస్థపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారన్నారు. శనివారం సోమాజిగూడలో మంత్రి నివాసంలో టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి, యూనియన్ నేతలు కమలాకర్ గౌడ్, యాదయ్యతో పాటు రాష్ట్ర కమిటీకి చెందిన సుమారు 25 మంది నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రవాణా శాఖ పొన్నంకు కేటాయించినందుకు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్యాసింజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు పలు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత బస్ భవన్‌కు వస్తానని మంత్రి చెప్పారని నేతలు వెల్లడించారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి మాట్లాడుతూ.. 10 ఏండ్ల కేసీఆర్ నియంతృత్వ, అప్రజాస్వామ్య, రాక్షస పాలనలో ఆర్టీసీ కార్మికులు దగా పడ్డారని ఆరోపించారు.  ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ను ఈయూ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. 

నేడు నియోజకవర్గాల్లో రెండు స్కీంలు స్టార్ట్.. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ఆదివారం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్టార్ట్ చేసి, ప్రజలకు అవగాహన కల్పించి సంబురాలు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా శనివారం జిల్లా అధికారులు, కలెక్టర్లు సమీక్షలు నిర్వహించారు.  ఆయా కార్యక్రమాల్లో మంత్రులు కూడా పాల్గొననున్నారు.