తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి రగులుకునే వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయి. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాలో ప్రక్షాళన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఇప్పుడు తెలంగాణ గడప తొక్కనుంది. ఓటర్ల జాబితాలో ‘ఫ్యూరిఫికేషన్’ కోసం ‘సర్’ అని ఎన్నికల సంఘం చెబుతున్నా ప్రధానంగా ఎన్డీఏయేతర రాజకీయ పార్టీలు ‘క్లారిఫికేషన్’ లేదంటూ ఆందోళన చెందుతున్నాయి. పలు వివాదాలతో బిహార్ అనంతరం మరో 12 రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ‘సర్’ పై రాజకీయ దుమారం రేగుతోంది.
త్వరలో తెలంగాణలో కూడా ‘సర్’ చేపడుతామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య చలికాలంలో సెగ ప్రారంభమవడం ఖాయం. హైదరాబాద్‌లో జరిగిన బీఎల్‌ఓల సమావేశంలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ మాట్లాడుతూ... ‘తెలంగాణలో కలిసికట్టుగా ‘సర్’ను విజయవంతం చేద్దాం. బిహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన దేశానికి ఆదర్శంగా నిలిచింది. అక్కడ ఏడున్నర కోట్లమందితో తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తే.. ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు.’ అని వ్యాఖ్యానించారు. బిహార్‌లో ‘సర్’పై సాంకేతికంగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అత్యున్నత అధికారిగా ఆయన చెప్పుకున్నా దానిపై రేగిన అలజడి అందరికీ తెలిసిందే.
సుప్రీం జోక్యంతో..
‘సర్’ ప్రక్రియను ఎన్నికల సంఘం 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో చేపట్టింది. అస్సాం రాష్ట్రంలో ‘సర్’ పేరుతో కాకుండా ‘స్పెషల్ రివిజన్’ (ఎస్‌ఆర్) నమూనాలో ఓటర్ల జాబితాను సవరిస్తున్నారు. అన్నిచోట్ల ఎన్డీఏయేతర పార్టీల నుంచి ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్’ ప్రక్రియపై ఆందోళనలు వెలువడుతున్నాయి. బిహార్ ‘సర్’ ప్రక్రియలో ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోమని తొలుత ఎన్నికల సంఘం చెప్పినా ఆధార్‌తో సహా మొత్తం 12 రకాల గుర్తింపు కార్డులను లెక్కలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కొంత ఆందోళన తగ్గింది. బిహార్‌లో ‘సర్’ ప్రక్రియతో దాదాపు కోటిమంది ఓట్లు తొలగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా... సుప్రీంకోర్టు జోక్యంతోపాటు తీవ్ర రాజకీయ ఒత్తిడి మధ్యన చివరికి సుమారు 65 లక్షల మంది ఓట్లు తొలగించి 7.42 కోట్ల ఓటర్లతో జాబితా విడుదలైంది.
వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు
భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ప్రకారం పలు రాష్ట్రాల్లో భారీగానే ఓట్లను తొలగించారు. వీటి ప్రకారం తమిళనాడులో దాదాపు 97 లక్షల పేర్లు తొలగించారు. దీనిపై అధికార డీఎంకే విరుచుకుపడుతోంది. గుజరాత్ లో 73 లక్షలకు పైగా ఓట్ల తొలగింపులో బీజేపీ కక్షగట్టి ఒకవర్గం ఓట్లను లక్ష్యంగా చేసుకుందని కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాల్లోని తొలగింపు జాబితాపై పలు కథనాలతోపాటు పలు ప్రచారాలు బయటకు పొక్కినా నిర్ధారణ కాలేదు. మరోవైపు కేరళలో దాదాపు పాతిక లక్షల ఓట్లు మాయమైనట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, అస్సాంలో ‘సర్’తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస చ్చినవారు ఇక్కడ నకిలీ గుర్తింపు కార్డులతో ఓటర్లుగా నమోదయ్యారనే
వాదనలపై నిరసనలు వెలువడుతున్నాయి.
నకిలీ ఓట్లు
నగరంలో ఏపీ నుంచి వచ్చి స్థిరపడ్డవారిలో కొందరికి ఆ రాష్ట్రంలో కూడా ఓటు ఉందనే ప్రచారం ఉంది. అంతేకాక రాజధాని కావడంతో తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నవారిలో కూడా కొందరికి వారి జిల్లాల్లోకూడా ఓటు ఉందనే ప్రచారం కూడా ఉంది. ఈ కారణాలతో ఇక్కడ ‘సర్’ ఓట్ల తొలగింపులో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. నగరంలో నకిలీ గుర్తింపు కార్డులతో బంగ్లాదేశీయులు, రోహ్యింగాలు కొందరు అక్రమంగా ఉంటున్నారనే ఆరోపణలు బీజేపీ ఎప్పటినుంచో చేస్తోంది. ఇప్పుడు అదే అంశాన్ని ఆ పార్టీ ప్రధానంగా లేవనెత్తే అవకాశాలుండడంతో ఇతర పక్షాల ప్రత్యారోపణలు ఖాయం. దీంతో ఇతర రాష్ట్రాలోవలే హైదరాబాద్‌లో కూడా ‘సర్’ సున్నితంగా మారవచ్చు. తెలంగాణలో ఒక్కో బీఎల్‌ఓ పరిధిలో సగటున 930 మంది ఓటర్లున్నారని, ‘సర్’లో వారిదే కీలకపాత్రని సీఈసీ చెబుతున్నా రాజకీయ జోక్యం, ఒత్తిడి లేకుండా పారదర్శకంగా జరిగితే ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రజాస్వామ్యానికి మేలు చేసేదిగా ఉండే దేన్నయినా స్వాగతించాల్సిందే. అదే సందర్భంలో రాజకీయ ప్రయోజనార్థం వివక్షతో చేస్తే ఎండగట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వివాదాస్పదమైన ‘సర్’ ప్రక్రియ తెలంగాణలో సాఫీగా సాగేందుకు ఎన్నికల సంఘంతోపాటు రాజకీయ పక్షాలు కూడా కృషి చేయాలి.
తెలంగాణలో కూడా ‘సర్’పై సందేహాలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణముల్ కాంగ్రెస్ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. స్వయాన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనకు దిగుతూ ఎన్నికల సంఘాన్ని, బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అక్రమ వలసదారుల పేరుతో ఎన్నికల సంఘం అసలైన ఓటర్లను తొలగిస్తుందని టీఎంసీ ఒకవైపు విమర్శిస్తున్నా, మరోవైపు అక్కడ సుమారు 58 లక్షల ఓట్లు తొలగించినట్టు ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ విడుదలైంది. మరోవైపు అస్సాంలో బంగ్లాదేశ్ వలసదారులను ఇంటికి పంపడం ఖాయమని ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ చెబుతున్నారు. ఎన్నికల సంఘం తెలంగాణలో కూడా ‘సర్’ నిర్వహణకు సంసిద్దమవుతున్నవేళ ఇక్కడ కూడా పలు సందేహాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో రాజకీయ దుమారం రేగడం ఖాయం. హైదరాబాద్ ఓటర్ల జాబితాలో గందరగోళం నెలకొనే అవకాశాలున్నాయి.
- ఐ.వి.మురళీకృష్ణ శర్మ,
సీనియర్ జర్నలిస్ట్
