బ్రిటన్ కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకానికి ఏర్పాట్లు

బ్రిటన్  కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకానికి ఏర్పాట్లు

లండన్: బ్రిటన్  కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాజు కోసం ఇప్పటికే కిరీటానికి మార్పులు చేశారు. గత 70 ఏళ్లలో మొదటిసారిగా అతిపెద్ద మిలటరీ ఊరేగింపు నిర్వహించేందుకు సైన్యాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నెల 6న చార్లెస్ 3కి పట్టాభిషేకం జరగనున్న సంగతి తెలిసిందే. వెస్ట్ మినిస్టర్  అబేలోని బకింగ్ హమ్  ప్యాలెస్​లో అత్యంత ఆడంబరంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. మధ్యయుగం నాటి అధికారానికి సూచికలైన రాడ్, మంత్రదండం, గోళాన్ని రాజ దంపతులకు మతపెద్దలు అప్పగించనున్నారు. అలాగే క్వీన్ కు కూడా కిరీటం తొడగనున్నారు. సైనికులు, బ్యాండ్  మోగించేవారు వీధుల గుండా ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అందుకు రిహార్సల్స్  చేస్తున్నారు. పట్టాభిషేక వేడుకలకు 203 దేశాల నుంచి అతిరథ మహారథులు హాజరుకానున్నారు.

1952లో మూడేండ్లకు వారసుడైనాడు

కింగ్  చార్లెస్ 3కి మూడేండ్ల వయసు ఉన్నపుడు 1952లో తమ వారసుడిగా రాజ కుటుంబం ప్రకటించింది. తర్వాత ఆయన వేల్స్ కు రాకుమారుడు అయ్యారు. 1958 నుంచి 2022 మధ్య 64 ఏండ్ల సుదీర్ఘ కాలం వేల్స్ కు ఆయన రాకుమారుడిగా ఉన్నారు. ప్రిన్స్  ఆఫ్​ వేల్స్ గా 2011లో టాంజానియాలో ఆయన ‘కీపర్  ఆఫ్ ద కౌవ్స్’ అనే బిరుదును అందుకున్నారు. 

1066 నుంచి వెస్ట్ మినిస్టర్ లోనే వేడుకలు

బ్రిటన్  రాజ కుటుంబ పట్టాభిషేక వేడుకలు 1066 నుంచి వెస్ట్ మినిస్టర్  అబేలోనే నిర్వహిస్తున్నారు. గతంలో పట్టాభిషేకానికి రెండు రాత్రుల ముందు మోనార్క్.. లండన్  టవర్ లో బసచేసేవారు. పట్టాభిషేకానికి ఒకరోజు ముందు లండన్  వీధుల గుండా వెస్ట్ మినిస్టర్ కు ఊరేగింపుగా వెళ్లేవారు. కింగ్ చార్లెస్ 2 వరకు 1661 దాకా ఈ సంప్రదాయం కొనసాగింది. 1937 నుంచి రాజుతో పాటు రాణికి కూడా కిరీటం తొడిగే ఆచారాన్ని పాటిస్తున్నారు. అలా కిరీటం ధరించిన చివరి క్వీన్  ఎలిజబెత్. ఈమె కింగ్  జార్జ్ 6 భార్య. పట్టాభిషేకానికి ‘ద వెడింగ్ రింగ్  ఆఫ్​ ఇంగ్లండ్’ అని కూడా పేరు ఉంది. 1831లో కింగ్  విలియం 4 కాలం నుంచి ప్రతి పట్టాభిషేకంలోనూ ఈ రింగ్ ను ప్రదర్శించారు. పట్టాభిషేకానికి సంబంధించిన ఫొటోను తొలి సారిగా 20వ శతాబ్దంలో తీశారు. అపుడు జార్జ్ 5కి పట్టాభిషేకం చేసినపుడు ఎంపీ సర్  బెంజమిన్  స్టోన్ ఈ ఫొటో తీశారు. ఇక యూకే సాయుధ బలగాలకు చెందిన 6 వేల మందితో పాటు కామన్ వెల్త్  దేశాల నుంచి 400 మంది కింగ్  చార్లెస్ 3 పట్టాభిషేకానికి హాజరుకానున్నారు.

చార్లెస్​కు డబ్బావాలాల గిఫ్ట్

ముంబై: మోనార్క్​గా పట్టాభిషేకం జరుపుకోనున్న బ్రిటన్  కింగ్  చార్లెస్ 3 కోసం ముంబై డబ్బావాలాలు పుణేరీ పగ్డీ (తలపాగా), వార్కరి శాలువాను ప్రజెంట్ చేయనున్నారు. పట్టాభిషేక వేడుకలకు వారికి కూడా ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో డబ్బావాలాలు మంగళవారం ముంబైలో పుణేరీ పగ్డీ, వార్కరి శాలువాను కొనుగోలు చేశారు. పుణేరీ పగ్డీకీ 2009లో ‘జియోగ్రాఫికల్  ఇండికేషన్’ గుర్తింపు లభించింది. గౌరవానికి, రాజసానికి 
పుణేరీ పగ్డీని ప్రతీకగా భావిస్తారు.