- సీజనల్ ఫీవర్స్ నుంచి సర్జరీల దాకా..
- డేటా దాస్తే పబ్లిక్ హెల్త్ యాక్ట్ ప్రకారం చర్యలు
- లెక్కలు ఇవ్వకపోవడంతో అంటువ్యాధుల నియంత్రణ కష్టమవుతోందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు:ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ తీసుకున్న పేషంట్ల లెక్క ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆదేశించారు. పేషెంట్ అడ్మిట్ అయిన దగ్గర్నుంచి.. డిశ్చార్జ్ అయ్యే వరకు, అలాగే టెస్టుల వివరాలన్నీ పక్కాగా అధికారులకు చేరాల్సిందేనని స్పష్టం చేశారు. ఈమేరకు డీఎంహెచ్‌వో ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్ పబ్లిక్ హెల్త్ యాక్ట్- 1939, మున్సిపాలిటీ యాక్ట్-1965 ప్రకారం.. ఏ హాస్పిటల్ అయినా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, టీబీ వంటివి కేసు నిర్ధారణ అయితే, వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు చేరవేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రతి నెలా రిపోర్ట్ తప్పనిసరి..
కేవలం వ్యాధుల వివరాలే కాదు, హాస్పిటల్ లో జరిగే ప్రతీ వైద్య సేవకు సంబంధించిన లెక్కలను ప్రతి నెలా సమర్పించాలని డీఎంహెచ్‌వో ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ తమ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(యూపీహెచ్సీ) మెడికల్ ఆఫీసర్ కు ఈ రిపోర్టులను పంపించాలని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, టైఫాయిడ్, టీబీ, కలరా, హెపటైటిస్, రేబిస్, పాముకాటు కేసులతో పాటు నాన్ -కమ్యూనికబుల్ డిసీజెస్ అయిన బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్ కేసుల వివరాలు కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. ల్యాబ్ రిపోర్టులు, స్కానింగ్ వివరాలు కూడా చెప్పాలన్నారు. ప్రసవాలు, పిల్లల వివరాలూ ఇవ్వాంల్సిందేనన్నారు.
వ్యాధుల నివారణ చర్యలకు..
హైదరాబాద్ సిటీలో సగానికి పైగా జనం ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఆ వివరాలను కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వానికి ఇవ్వడం లేదు. ఉదాహరణకు.. ఒక ఏరియాలో పది మందికి డెంగ్యూ వస్తే.. ఆ విషయం ప్రైవేట్ హాస్పిటల్స్ చెబితేనే బల్దియా సిబ్బంది అక్కడ ఫాగింగ్, దోమల నివారణ చర్యలు చేపట్టగలరు. లెక్కలు చెప్పకపోవడంతో ఎక్కడ ఏ వ్యాధి ప్రబలుతుందో తెలియక.. నివారణ చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది.
దీనివల్ల వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తున్నాయి. పైగా కచ్చితమైన గణాంకాలు లేకపోవడంతో బడ్జెట్ కేటాయింపులు, మందుల సప్లైలోనూ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఇకపై కచ్చితమైన డేటా ఇవ్వాల్సిందేనని డీఎంహెచ్‌వో
స్పష్టం చేశారు.
రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవు
వ్యాధుల నివారణలో గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఏయే సమస్యలు ఎక్కువగా ఉన్నాయో తెలిస్తే.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్- 2010 నిబంధనల ప్రకారం వైద్య సేవలు అందించే ప్రతీ కేంద్రం ఈ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైనా ఆదేశాలను బేఖాతరు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ వెంకటి, డీఎంహెచ్‌వో, హైదరాబాద్
