
ఐపీఎల్ 2023 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ వైదొలిగింది. ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 168 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక 136 పరుగులకే పరిమితమైంది.
168 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు వార్నర్, ఫిల్ సాల్ట్ అద్బుతమైన ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్కు 69 పరుగులు జోడించారు. అయితే 21 పరుగులు చేసిన సాల్ట్ ను హర్ ప్రీత్ బ్రర్ పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఢిల్లీ బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. వరుసగా మిచెల్ మార్ష్, రొస్సో, డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ మనీష్ పాండే పెవీలియన్ చేరారు. దీంతో ఒక్కసారిగా ఢిల్లీ 88 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
ఈ స్థితిలో ప్రవీణ్ దుబే కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అమన్ హకిం ఖాన్ తో కలిసి 7వ వికెట్ కు 32 పరుగులు జోడించాడు. అయితే 16 పరుగులు చేసిన అమన్ ను నాథన్ ఎల్లీస్ పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత ప్రవీణ్ దుబే కూడా నాథన్ ఎల్లీస్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. దీంతో ఈజీగా ఛేజ్ చేస్తుందనుకున్న ఢిల్లీ..వరుసగా వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులకే పరిమితమైంది. ఐపీఎల్ 2023 నుంచి నిష్క్రమించింది. పంజాబ్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రర్ 4 వికెట్లు పడగొట్టాడు. నాథన్ ఎల్లీస్, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభసిమ్రాన్ సింగ్ సెంచరీతో చెలరేగాడు. ప్రభసిమ్రాన్ సింగ్ కేవలం 65 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (7) రెండో ఓవర్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ (4) కూడా ఇషాంత్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. జితేశ్ శర్మ(5) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో పంజాబ్ 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఈ సమయంలో సామ్ కరన్ (20) తో కలిసి ప్రభసిమ్రాన్ సింగ్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఐపీఎల్ కెరీర్‌లో మొదటి సెంచరీ నమోదు చేశాడు. చివర్లో షారూక్ ఖాన్ (2), సికిందర్ రజా (11) విఫలమవడంతో పంజాబ్ 167 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబె, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.