న్యూఢిల్లీ: మనదేశంలోని మూడు మెట్రో సిటీల్లోని స్టార్టప్‌లకు డబ్బు వరదలా పారుతోంది. ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ మధ్య నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై, బెంగళూరు సిటీల్లోని స్టార్టప్‌లకు మొత్తం నిధుల్లో దాదాపు 95శాతం వాటా దక్కింది. ఇదే ఏడాది ఏప్రిల్–-జూన్ కాలంలో మొత్తం నిధులు 40శాతం తగ్గి 6.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం భారతీయ స్టార్టప్‌లపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. "స్టార్టప్ డీల్స్ ట్రాకర్ -2022 క్యూ2" పేరుతో పిడబ్ల్యుసి ఇండియా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. మొత్తం నిధుల్లో ప్రారంభ-దశ (ఎర్లీస్టేజ్)ఒప్పందాల వాటా 60శాతం కంటే ఎక్కువ ఉంది. ఒప్పందం సగటు విలువ 5 మిలియన్ డాలర్లు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తరువాత చెన్నై, పూణేల్లో స్టార్టప్‌లకు భారీగా ఫండింగ్ వస్తోంది. బెంగళూరులోని ఏడు స్టార్టప్‌లు 2022 రెండవ క్వార్టర్లో ఒక్కొక్కటి 100 మిలియన్ డాలర్లకు పైగా ఫడింగ్ దక్కించుకున్నాయి. వీటిలో డెయిలీ హంట్, ర్యాపిడో, లీడ్స్క్వేర్డ్, లెన్స్‌కార్ట్, క్రెడ్, ఎథర్ ఎనర్జీ, అబ్జర్వ్ ఉన్నాయి. ఇవి సాఫ్ట్‌వేర్ యాజ్ సర్వీస్, ఆటోటెక్సెక్టార్లలో పనిచేస్తున్నాయి. ఢిల్లీ–ఎన్‌సిఆర్‌లోని ఏడు కంపెనీలు డెల్హివరీ, స్టాష్‌ఫిన్, రారియో, గ్రే ఆరెంజ్ రోబోటిక్స్, అబ్సొల్యూట్ ఫుడ్స్, ఫాషింజా, ఫిజిక్స్ వాలాతో సహా ఒక్కొక్కటి 100 మిలియన్ డాలర్లకు పైగా సేకరించాయి. ముంబైలో నాలుగు స్టార్టప్‌లు అప్‌గ్రేడ్, జెప్టో, కాయిన్ డీసీఎక్స్, టర్బిల్మింట్ 100 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేశాయి. సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్, ఫిన్‌టెక్ స్టార్టప్‌లు 2022 క్యాలెండర్ ఇయర్లో 3.1 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ నిధులను సంపాదించాయి. ఇవన్నీ ప్రారంభ దశ ఒప్పందాలు కాగా, సగటు టిక్కెట్ సైజు 5 మిలియన్ డాలర్లుగా ఉంది.
