V6 News

రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉంటేనే వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్

రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉంటేనే వాహనాలకు  ఫిట్‌నెస్ సర్టిఫికెట్
  • భారీ వాహనాలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు తప్పనిసరి
  • విజిబిలిటీ లోపంతో యాక్సిడెంట్లు జరుగుతున్నందున ప్రభుత్వం నిర్ణయం
  • పాత స్టిక్కర్లు మే 20లోపు మార్చుకోకుంటే జరిమానా  

హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా భారీ వాహనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇకపై లారీలు, ఇతర భారీ వాహనాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉంటేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ నూతన విధానం ఫిబ్రవరి 20 నుంచే  రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. రాత్రిపూట రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలను గుర్తించలేక వెనుక నుంచి వచ్చే వెహికల్స్ ఢీకొంటున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టడానికి వాహనానికి మూడు వైపులా నాణ్యమైన రిఫ్లెక్టివ్ టేపులను నిర్ణీత కొలతలతో అమర్చడం తప్పనిసరి చేశారు.

మార్కెట్‌లో లభించే నాణ్యత లేని డూప్లికేట్ స్టిక్కర్ల వల్ల ప్రయోజనం లేదని గుర్తించిన అధికారులు.. నకిలీలను అరికట్టేందుకు వీటికి ప్రత్యేక క్యూఆర్ కోడ్లను కేటాయించారు. దీనివల్ల ప్రతి వాహనం రిఫ్లెక్టివ్ టేపు వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో సులభంగా ట్రాక్ చేసే వీలుంటుంది. ఈ స్టిక్కర్లు రెండేండ్ల గ్యారెంటీతో లభిస్తాయి. పాత స్టిక్కర్లు ఉన్న వాహన యజమానులు వాటిని మార్చుకోవడానికి మే 20 వరకు గడువు ఇచ్చారు. గడువు ముగిసిన తర్వాత నిబంధనలు పాటించని వాహనాలపై భారీ జరిమానాలు విధించనున్నారు.

విజిబిలిటీ లోపంతోనే యాక్సిడెంట్లు

ఐఐటీ ఢిల్లీ, జేఎన్‌టీయూ హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల అధ్యయనాల ప్రకారం.. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం 'విజిబిలిటీ(దృశ్యమానత)'లోపమేనని తేలింది. నాణ్యమైన రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉండటం వల్ల దాదాపు ఒక కిలోమీటరు దూరం నుంచే కాంతి పరావర్తనం చెంది వెనుక వచ్చే డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ పరిశోధనలో కూడా ఈ స్టిక్కర్లు భారీ వాహనాలకు ప్రాణరక్షణ కవచాలుగా మారుతాయని నిరూపితమైంది. రోడ్డు భద్రతపై రాజీపడకుండా రిఫ్లెక్టివ్ స్టిక్కర్ల అమలు నిబంధనను పక్కాగా అమలు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ మంజూరులో రిఫ్లెక్టివ్ స్టిక్కర్లే ప్రధాన ప్రమాణంగా మారనున్నాయి. ప్రభుత్వ తీసుకున్న ఈ ముందస్తు చర్యల వల్ల భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాల మరణాల రేటు గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.