- రాచకొండ కమిషనరేట్పరిధిలో 15.41 శాతం పెరిగిన నేరాలు
- విజిబుల్ పోలీసింగ్‌తో 15 శాతం దొంగతనాలు డౌన్
- తగ్గిన సైబర్ నేరాలు, రూ.40 కోట్లు రిఫండ్
- వార్షిక నేర నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు:రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈసారి గృహహింస కేసులు తగ్గిగా పోక్సో కేసులు పెరిగాయి. గృహహింస కేసులు నిరుడు 1,222 నమోదు కాగా.. ఈసారి 782 కేసులు రికార్డయ్యాయి. అదే సమయంలో పిల్లలపై వేధింపులు, పోక్సో కేసులు పెరిగాయి. హత్యలు, అత్యాచారాలు స్వల్పంగా తగ్గినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే నిరుటి కన్నా 15.41% కేసులు ఎక్కువ నమోదయ్యాయి. గత ఏడాది మొత్తం 28,626 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 33,040 కు పెరిగాయి. 2024తో పోలిస్తే సైబర్ నేరాలు తగ్గాయి.
గతేడాది 4,618 సైబర్ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 3734 కేసులు రిపోర్ట్ అయ్యాయి. సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన సొమ్ములో రూ.40.10 కోట్లు రిఫండ్ చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ సుధీర్ బాబు సోమవారం 2025 వార్షిక నివేదిక విడుదల చేశారు. నాగోల్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎల్బీ నగర్, మహేశ్వరం, యాదాద్రి భువనగిరి డీసీపీలతో కలిసి సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు.
ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్, ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్‌బాల్, మిస్ వరల్డ్ టూర్లు, రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన భారీ ఈవెంట్లకు పటిష్ట బందోబస్తు కల్పించామన్నారు. శివారు ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్, నేరాలను నియంత్రించేందుకు రౌడీషటర్లపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. రౌడీషీటర్లకు ట్రాఫిక్ విధులు అప్పగించి సామాజిక సేవలకు వినియోగించమన్నారు. సైకిల్ ప్యాట్రోలింగ్, సిటీ ఆర్మ్డ్ ఫోర్స్ గస్తీ వంటి విజిబుల్ పోలీసింగ్ ద్వారా చోరీలు, ఇళ్లలో దొంగతనాలను 15% తగ్గించగలిగామన్నారు.
కన్విక్షన్ రేట్‌లో రాష్ట్రంలో మొదటి స్థానం
ఈ ఏడాది 7,658 కేసుల్లో 5647 కేసులకు శిక్షలు పడ్డాయని, 74 శాతం కన్విక్షన్ రేటు పెరిగిందని సీపీ సుధీర్ బాబు తెలిపారు. కోర్టు తీర్పుల్లో మొత్తం 146 కేసుల్లో ఏడాది నుంచి జీవిత ఖైదీలుపడ్డ కేసులు ఉన్నాయన్నారు. అత్యాచారం కేసులు కొంతమేర తగ్గినప్పటికీ చిన్నారులపై లైంగిక దాడులకు సింబంధించిన పోక్సో కేసుల సంఖ్య బాగా పెరిగిందని సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. ఇందుకు కారణం పోక్సో కేసుల్లో బాధితులు, నిందితులు మైనర్లుగా ఉండడమే అన్నారు. ఇందులోనూ అధిక శాతం స్నేహితులు కాగా.. బంధువులు, ఇంటి చుట్టుపక్కన ఉన్న వారు లైంగిక దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇక మహిళలు, చిన్నారుల భద్రతకు షీ టీమ్స్, విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు సహా పబ్లిక్ ప్లేసెస్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
డ్రగ్స్, సైబర్ నేరాలపై సమగ్ర దర్యాప్తు
గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామని సీపీతెలిపారు. ఎన్‌డీపీఎస్, ఎక్సైజ్ యాక్ట్ కింద ఈ ఏడాది 912 కేసులు నమోదు కాగా.. ఏడీపీఎస్ కేసుల్లో రాష్ట్రానికి చెందిన 495 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 173 మంది సహా ఎక్సైజ్ కేసుల్లో 689 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. 2090 కిలోల గంజాయి, 34 కిలోల గంజాయి చాక్లెట్లు, 34 కిలోల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం రూ.20 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేశామని వెల్లడించారు.
