12 ఏళ్లలో 152 పేపర్ లీక్స్.. 7.5 కోట్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం: రాహుల్ గాంధీ

12 ఏళ్లలో 152 పేపర్ లీక్స్.. 7.5 కోట్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం: రాహుల్ గాంధీ

దేశంలో నీట్ పేపర్ లీకేజ్, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో ఇప్పటివరకు 152 ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయని, దీనివల్ల 7.5 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని విమర్శించారు. నిత్యం ఏదో ఒక చోట పేపర్లు లీక్ అవ్వడం వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కేంద్రం తీరు వల్ల దాదాపు 1.32 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని తెలిపారు రాహుల్ గాంధీ. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్క నిందితుడిని కూడా ప్రభుత్వం శిక్షించలేదని దుయ్యబట్టారు. గడిచిన పన్నెండేళ్లలో దేశంలో విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 

 శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం హరిస్తోందని, విద్యార్థులపై దాడులు చేయడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న భారత విద్యా వ్యవస్థను బిజెపి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, యువత భవిష్యత్తుపై కేంద్రానికి కొంచెమైనా పట్టింపు లేదని అన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా విఫలమయ్యారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.