మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ భారీ అడ్వెంచరస్ మూవీ టైటిల్‌ను శనివారం అనౌన్స్ చేశారు. ‘గ్లోబ్‌ట్రాటర్’ పేరుతో ఆర్‌ఎఫ్‌సీలో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించిన రాజమౌళి టీమ్.. ఈ వేదికపై ‘వారణాసి’ అనే టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్, ‘వారణాసి టు ది వరల్డ్’ పేరుతో వీడియోను విడుదల చేశారు.
యుగాలు, ఖండాలతో కూడిన అద్భుతమైన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సాగిన ఈ వీడియో చివర్లో.. వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో చేతిలో త్రిశూలం పట్టుకుని ఎద్దుపై వస్తున్న మహేష్ బాబు లుక్ ఇంప్రెస్ చేసింది. అలాగే వేదికపై కూడా ఎద్దు బొమ్మపై కూర్చుని మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వడం ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది.
రాముడిగా నవరసాలు పలికించాడు..
రాజమౌళి మాట్లాడుతూ ‘‘బాహుబలి’ మినహా నా ప్రతి సినిమాకు ప్రెస్‌మీట్ పెట్టి కథ చెప్పాను. కానీ ఇలాంటి సినిమా కథను మాటల్లో చెప్పడం కుదరదు. ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఒక వీడియో రిలీజ్ చేయాలనుకున్నాం. ఆ వీడియో ద్వారానే సినిమా స్టోరీ, స్కేల్ చెప్పాలనుకున్నాం. ఎన్టీఆర్ అభిమానినైన నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కృష్ణ గారి గొప్పతనం తెలిసింది. ఆయన కొత్త టెక్నాలజీతో ఎన్నో కొత్తదారులు వేసుకుంటూ వెళ్లారు. అలాంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్‌తో సరికొత్త టెక్నాలజీ పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నాం. ప్రీమియం లార్జ్ స్కేల్ ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ మూవీ రాబోతోంది. ఇక నాకు దేవుడిపై పెద్ద నమ్మకం లేదు. కానీ చిన్నప్పట్నుంచీ రామాయణం, మహా భారతం అంటే చాలా ఇష్టం.
మహా భారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చాలా సార్లు చెప్పా. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని అనుకోలేదు. కానీ ఒక్కొక్క సీన్ తీస్తుంటే, ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే గాలిలో తేలుతున్న ఫీలింగ్ వచ్చింది.
మహేష్‌కు రాముడి గెటప్ వేసి, ఫొటో షూట్ చేస్తుంటే గూస్ బంప్ప్ వచ్చాయి. మహేష్ కొంటెగా ఉంటాడు.. కృష్ణుడికి కరెక్ట్ కానీ రాముడికి సెట్ అవుతాడో లేదోననే డౌట్, కచ్చితంగా సూట్ అవుతాడని నమ్మకం మధ్య ఊగిసలాడుతూ ఉండేవాడిని. షూటింగ్‌లో మాత్రం ఎలాంటి అనుమానం కలగలేదు. రీసెంట్‌గా అరవై రోజుల షూటింగ్ కంప్లీట్ చేశాం. ఆ ఎపిసోడ్‌లో చాలా సబ్ ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒకొక్క సబ్ ఎపిసోడ్ ఒక్కో సినిమాలా.. ప్రతిదీ చాలెంజింగ్‌గానే ఉండేది. అవన్నీ దాటుకుని ఆ సీక్వెన్స్ పూర్తి చేశాం. నా సినిమాల్లోనే ఇది మోస్ట్ మొమరబుల్ సీక్వెన్స్. ఎవరూ ఊహించనంత అందంగా మహేష్ ఉంటాడు. ఊహించనంత పరాక్రమంగా, ఊహించనంత దయార్ధ్రహృదయంతో, ఊహించనంత కోపంగా ఉంటాడు. రాముడిగా అన్ని రసాలు పలికించాడు. ఈ ఎపిసోడ్ షూట్ చేసే విషయంలో నేను చాలా లక్కీ” అని చెప్పారు.
మహేష్ బాబు విశ్వరూపం చూస్తారు..
‘ఇలాంటి ఓ ప్రెస్టీజియస్ తెలుగు ప్రాజెక్టులో భాగమవడం ఆనందంగా ఉందని, మందాకిని పాత్ర కోసం తనను ఎంపిక చేసిన రాజమౌళికి ప్రియాంక చోప్రా థ్యాంక్స్ చెప్పారు. పృథ్విరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ ‘నా ఫ్రెండ్ ప్రభాస్ చెప్పినట్టుగా ఓరోజు రాజమౌళి గారు ఇచ్చిన అద్భుతమైన నెరేషన్ విన్నాను. కథ మొదలుపెట్టిన ఐదు నిమిషాలకే నిర్ఘాంతపోయా. ఆ తర్వాతి మూడు గంటలు తనకు ఇష్టమైన కామిక్ బుక్ వింటున్న చిన్న పిల్లాడిని అయిపోయా. ఓ వ్యక్తి ఇలా ఎలా ఆలోచిస్తాడు అని ఆశ్చర్యమేసింది. నన్ను నమ్మినందుకు థ్యాంక్స్’ అని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు సంబంధించి 30 నిమిషాల యాక్షన్ సీన్‌ను ఒకటి చూశా. మహేష్ బాబు విశ్వరూపం అలా చూస్తుండిపోయాను. మీరు కూడా ఆ అనుభూతి పొందుతారు” అని చెప్పారు.
2027 సమ్మర్‌లో...
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మాట్లాడుతూ ‘గ్లోబ్ అంటే ఎన్నో ఖండాలు, ఎన్నో దేశాలు, ఎన్నెన్నో వింతలు ఉన్నాయి. వాటన్నింటిలో ఎన్నో కొన్ని ఇందులో చూపించబోతున్నాం. ఈ మధ్య కొత్త ఫ్లాట్ కొన్నా... మహేష్ బాబు ఫ్యాన్స్ హృదయాల్లో పర్మినెంట్‌గా ఉండిపోయే ఫ్లాట్. 2027 సమ్మర్‌కు గృహప్రవేశం. అందరూ రెడీగా ఉండండి’ అని చెప్పారు. నిర్మాతలు కేఎల్ నారాయణరావు, ఎస్ఎస్ కార్తికేయ, కథా రచయిత కాంచి, మాటల రచయిత దేవ కట్టా సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
పౌరాణిక చిత్రాలు చేయడం నాన్న కోరిక
సింపుల్‌గా బులుగు చొక్కాతో స్టేజ్ పైకి నడిచొస్తానంటే రాజమౌళి కుదరదన్నారు. గుండీలు కూడా లేని చొక్కాతో ఇలా స్టైల్‌గా సెట్ చేశారు. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మనలేదు. నెక్స్ట్ అదేనేమో. అభిమానులంతా అప్‌డేట్ అప్‌డేట్ అని అడిగారుగా.. ఎలా ఉంది ఈ అప్‌డేట్. మన డైలాగ్ తరహాలో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది.. నాక్కూడా. ఇక మా నాన్న గారు చెప్పే ప్రతి మాట వినేవాడిని... ఒక్క మాట తప్ప. ఆయనెప్పుడూ ఒక పౌరాణిక సినిమా చేయమనేవారు.
ఆ మాటెందుకో నేనప్పుడు వినలేదు. ఈరోజు నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మాతో ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒకరకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. అందర్నీ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా రాజమౌళి గారిని. ఈ చిత్రం విడుదలయ్యాక దేశమంతా గర్వంగా ఫీలవుతుంది. - మహేష్ బాబు
