ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వేస్తున్న ఏపీ

 ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వేస్తున్న ఏపీ

ప్రాజెక్టు వద్ద గుట్టుచప్పుడు కాకుండా పనులు
తెలంగాణ సర్కారు సైలెన్స్​
గద్వాల జిల్లా నడిగడ్డ వద్ద 87,500 ఎకరాలు ఇక ఎడారే
ఆందోళనలో ఆయకట్టు రైతులు

ఇప్పటికే తుంగభద్ర వెంట పలు లిఫ్ట్​లను నిర్మించి నీటిని తరలించుకుపోతున్న ఏపీ.. ఇప్పుడు ఆర్డీఎస్ వద్ద కుడి కాలువ తవ్వకం పనులు మొదలుపెట్టింది. సీడబ్ల్యూసీ అనుమతి లేకున్నా, ఎక్స్​కవేటర్లను దింపుతూ, కన్ స్ట్రక్షన్  మెటీరియల్ తరలిస్తోంది. నెల కింద అలంపూర్ రైతులు ఆర్డీఎస్ ను సందర్శించి కుడి కాలువ నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇరిగేషన్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ మన సర్కారు స్పందించకపోవడంతో నడిగడ్డలో 87,500 ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకమవుతోంది.

అయిజ, వెలుగు: తుంగభద్ర నది వెంట ఇప్పటికే పలు ఎత్తిపోతల పథకాలను నిర్మించి నీటిని తోడుకెళ్తున్న ఏపీ సర్కారు, ఇప్పుడు ఆర్డీఎస్ వద్ద కుడి కాలువ తవ్వకానికి రెడీ అయింది. గుట్టుచప్పుడు కాకుండా పనులను ప్రారంభించింది. కాలువ తవ్వకానికి అవసరమైన మెటీరియల్​ను అక్కడికి తరలించింది. ఏపీ చేపడుతున్న కుడి కాలువ నిర్మాణంపై అలంపూర్​ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. విషయాన్ని ఇరిగేషన్​ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. తెలంగాణ సర్కారు నిర్లక్ష్యంతో  నడిగడ్డలో 87,500 ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకమవుతోంది.
స్లూయిస్​ను మూస్తలేరు.. 
తుంగభద్ర నదిపై ఏపీ సరిహద్దులో ఆర్డీఎస్ ఆనకట్టను అప్పటి నిజాం సర్కార్ నిర్మించింది. అప్పట్లో నిర్మాణానికి ఇబ్బంది కలగకుండా నదిలోని నీటిని దిగువకు వదిలేందుకు స్లూయిస్(రంధ్రాలు) ఏర్పాటు చేశారు. ఆనకట్ట నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ స్లూయిస్​ను మూసి వేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ పాలకులు కుట్ర ప్రకారం స్లూయిస్​ మూసివేతకు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా స్లూయిస్ ద్వారా అధిక మొత్తంలో నీరంతా దిగువకు వెళ్తుండడంతో వరద జలాలతోపాటు,  తెలంగాణకు కాలువ ద్వారా ఇండెంట్ ప్రకారం రావాల్సిన వాటా దక్కడం లేదు. ఇది చాలదన్నట్లు  ఏపీ తుంగభద్ర నది వెంట పెద్ద సంఖ్యలో లిఫ్టు స్కీములు ఏర్పాటు చేసుకుని నీటిని దోచుకెళ్తోంది.  ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతుల ప్రయోజనాలకు గండికొట్టిన ఏపీ పాలకులు, రాష్ట్రం విడిపోయాక ఇప్పుడు అంతకు రెట్టింపు నీటిని వాడుకునేందుకు రైట్​ కెనాల్​ నిర్మాణానికి ప్లాన్​ చేశారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ సర్కారు కిమ్మనడం లేదు.
20 వేల ఎకరాలు దాటట్లే..
ఆర్డీఎస్ ​కింద నడిగడ్డలో 87,500 ఎకరాల ఆయకట్టు ఉండగా ఏపీ నీటి దోపిడీ కారణంగా గడిచిన 30 ఏండ్లలో ఏనాడూ 20 వేల ఎకరాలకు మించి సాగు కాలేదు. ఇప్పుడిక ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మిస్తే ఆ మాత్రం సాగుపైనా మన రైతులు ఆశలు వదులుకోవాల్సిందే. నిజానికి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద ఏపీ ప్రభుత్వం రైట్​ కెనాల్​ నిర్మించుకునేందుకు ఎలాంటి అనుమతులు లేవు. బ్రిజేష్  ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణా నది నుంచి తుంగభద్ర వరకు కెనాల్​ ఏర్పాటు చేసుకొని 4 టీఎంసీల నీటిని వాడుకునేందుకు మాత్రమే పర్మిషన్​ ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం దానిని పక్కనపెట్టి ఇష్టారీతిగా కుడి కాలువ తవ్వే  ప్రయత్నం చేస్తోంది.