- గత నవంబర్‌లో రంగారెడ్డి జిల్లాలో ఘటన, ఆలస్యంగా వెలుగులోకి..
చేవెళ్ల, వెలుగు : ఆస్తి కోసం అక్క కేసు వేసిందన్న కోపంతో ఓ యువకుడు తన తల్లిని హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దేవరంపల్లి గ్రామంలో రెండు నెలల కింద జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎలుగారి సుమతమ్మ (66)కు స్థానికంగా ఆరు ఎకరాలకు పైగా భూమితో పాటు మరో ప్రాంతంలో ప్లాట్ ఉంది. 20 గుంటల భూమితో పాటు ప్లాట్‌ను కూతురు రూప (పూజ)కు రాసి ఇచ్చింది.
ఈ విషయంలో సుమతమ్మ కొడుకు రాఘవేందర్‌రెడ్డి తన అక్క రూపతో గొడవ పడ్డాడు. దీంతో రూప మిగతా భూమిపై కూడా సివిల్ కోర్టులో కేసు వేసింది. ఇదిలా ఉండగానే గతేడాది నవంబర్‌లో సుమతమ్మ చనిపోయింది. ఆమె మృతిపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాఘవేందర్‌రెడ్డిపై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. తన చెంపపై కొట్టడంతో.. తల్లిని గొంతు నులిమి హత్య చేసినట్లు రాఘవేందర్‌రెడ్డి ఒప్పుకున్నాడు. దీంతో అతడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
