- ఖోఖో, కబడ్డీ వంటి ఆటలను ప్రోత్సహించేందుకు కృషి
- మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి
- కాజీపేట రైల్వే స్టేడియంలో జాతీయ స్థాయి ఖోఖో ఛాంపియన్ షిప్
హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఆటలకు పెద్ద పీట వేస్తోందని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందని, స్పోర్ట్స్ రిజర్వేషన్ పెంచే ఆలోచనతో ముందుకెళ్తోందని చెప్పారు. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 58వ జాతీయ స్థాయి సీనియర్స్ ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారం కాజీపేట రైల్వే స్టేడియంలో ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖోఖో, కబడ్డీ వంటి గ్రామీణ క్రీడలకు మంచి ఆదరణ ఉంటుందన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ పెంచేందుకు ఆటలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగడానికి ఇలాంది వేదికలు అవసరమని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ... యువత రీల్స్‌పై కాకుండా ఆటలపై ధ్యాస పెట్టాలని సూచించారు. గత ప్రభుత్వం క్రీడలను నాశనం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా 42 ఆటలతో స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో స్టేడియాలు నిర్మిస్తోందని, క్రీడాకారుల కోసం మౌలిక వసతులు కల్పిస్తోందని చెప్పారు.
తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ... జాతీయస్థాయి ఖోఖో పోటీలకు తొలిసారి తెలంగాణ రాష్ట్రం వేదికవడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ ఇండోర్ స్టేడియం డెవలప్‌మెంట్ కోసం రూ.కోటిన్నర మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో క్రీడాప్రాదికార సంస్థ సలహాదారు జితేందర్‌రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఖోఖో ఫెడరేషన్ ఇండియా చైర్మన్ ఎంఎస్.త్యాగి, జనరల్ సెక్రటరీ ఉపకార్‌సింగ్, ట్రెజరర్ గోవింద్‌శర్మ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సెక్రటరీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
మొదలైన మ్యాచ్‌లు...
జాతీయస్థాయి సీనియర్ ఖోఖో ఛాంపియన్ షిప్‌లో భాగంగా ఉమెన్స్ విభాగంలో మొదట అసోం, జమ్మూ కశ్మీర్ జట్లు తలపడ్డాయి. ఇందులో అసోం 28 పాయింట్లు సాధించగా.. జమ్మూ కశ్మీర్ 8 పాయింట్లకే పరిమితమైంది. దీంతో 20 పాయింట్ల తేడాతో అసోం గెలిచింది. మరో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్, బిహార్ జట్లు తలపడగా.. మధ్యప్రదేశ్ 40 పాయింట్లు సాధిస్తే.. బిహార్ కేవలం నాలుగు పాయింట్లే సాధించింది. మరోవైపు తెలంగాణ జట్టు 23 పాయింట్లు సాధించగా.. ఆల్ ఇండియా పోలీస్ ఫోర్స్ టీమ్ 10 పాయింట్లకే పరిమితమైంది. ఇక మెన్స్ విభాగంలో రాజస్తాన్, ఛండీగఢ్ తలపడగా.. రాజస్తాన్ 25 పాయింట్లు సాధించగా.. ఛండీగడ్ 16 పాయింట్లు సాధించింది.
మరో మ్యాచ్‌లో హరియాణా, హిమాచల్ ప్రదేశ్ పోటీ పడ్డాయి. ఇందులో హరియాణా 34 పాయింట్లు సాధించగా.. హిమాచల్‌ప్రదేశ్ 24 పాయింట్లు సాధించి ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో విదర్భ, గోవా టీమ్ తలపడగా.. విదర్భ 38 పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. గోవా కేవలం 4 పాయింట్లకే పరిమితమైంది.
