కాశీబుగ్గ, వెలుగు: హాస్పిటల్‌కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్య శారదాదేవి హెచ్చరించారు. బుధవారం వరంగల్ సిటీ లేబర్‌కాలనీ ఈఎస్ఐ హాస్పిటల్‌ను వారు ఆకస్మిక తనిఖీ చేయగా, డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రికార్డు, ఫార్మసీ విభాగంలో మందుల నిల్వలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ త్వరలో వరంగల్‌కు కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్స్ పార్కు, విమానాశ్రయం వంటి ప్రధాన ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో కార్మికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.
ఈ కారణంగా చికిత్స కోసం ఈఎస్ఐ హాస్పిటల్‌కు వచ్చే రోగుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని హాస్పిటల్లో మరింత సౌకర్యాలను ఇప్పటి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం ఈఎస్ఐ హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది కొరత, హాస్పిటల్ నిర్వహణ, సౌకర్యాల లోటుపాట్లు, సమస్యల పై సమీక్ష నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సాంబశివ రావు, ఈఎస్ఐ హాస్పిటల్ వైద్యులు తదితరులు ఉన్నారు.
