మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో చోరీ జరిగింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుడి నుంచి నాలుగున్నర తులాల బంగారు, 3 తులాల వెండి ఆభరణాలు గల బ్యాగ్ అపహరించాడు దుండగుడు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.
బాధితులు మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్- మంజుల దంపతులు . మహబూబాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ లొ బస్ కోసం వేచి చూస్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితుల కదలికలను పసిగట్టిన దుండగుడు బస్సు ఎక్కుతుండగా బ్యాగ్ లాక్కొని పారిపోయాడు. చోరీకి గురైన బంగారం విలువ దాదాపు 7 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు.
ఈ మధ్య బంగారం రేటు పెరగడంతో చాలా చోట్ల చైన్ స్నాచింగ్ లు, బంగారం చోరీ కేసులు పెరిగాయి. రద్దీ ప్రాంతాలు, ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని చోరీకి పాల్పడుతున్నారు. ప్రయాణికులు రద్దీ బస్టాండ్ లలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
