- ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తే సహించేది లేదు
- అణాపైసాతో సహా వసూలు చేస్తం... క్రిమినల్ కేసులు పెడ్తం
- స్టాంప్ డ్యూటీ సొమ్ము చెల్లింపుల్లో అక్రమాలపై అధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జరిగిన అన్ని లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఆడిటింగ్ నిర్వహించాలని అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగానికి పాల్పడిన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో రెవెన్యూ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశమయ్యారు. జనగాం తదితర ప్రాంతాల్లో బయటపడిన స్టాంప్ డ్యూటీ సొమ్ము చెల్లింపుల్లో అక్రమాలపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గత ఐదేండ్లలో జరిగిన 52 లక్షల లావాదేవీలపై ఆడిటింగ్ నిర్వహించగా.. 4,800 లోపాలు గుర్తించామని తెలిపారు. వీటిలో దాదాపు 3వేల లోపాలు రంగారెడ్డి ,యాదాద్రి జిల్లాల్లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించిన మొత్తాన్ని తప్పకుండా రికవరీ చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్‌లో భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ సొమ్ము పక్కదారి పట్టిన విషయాన్ని గుర్తించామని తెలిపారు.
ధరణిలో ఆడిటింగ్ విధానం లేకపోవడం వల్లే..
ధరణి పోర్టల్‌లో ఆడిటింగ్ విధానం లేకపోవడమే అక్రమాలకు ప్రధాన కారణమని ప్రాథమికంగా గుర్తించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి, లోతైన విచారణ జరిపించి బాధ్యులెవరో తేల్చి చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.
ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందా? లేదా? అన్న అంశంపై కూడా లోతైన విచారణ జరపాలని, ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ప్రభుత్వానికి రావాల్సిన అణాపైసా సొమ్ము దుర్వినియోగం చేసినా సహించేది లేదని అన్నారు. ప్రజల సొమ్ముతో ఆడుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని, ఇలాంటి అక్రమాలకు ఇకపై తావు ఉండబోదని స్పష్టం చేశారు.
