నేనే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని.. ట్రంప్ సంచలన ప్రకటన..

నేనే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని.. ట్రంప్ సంచలన ప్రకటన..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే అత్యధిక సుంకాలతో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ట్రంప్ వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనంటూ ప్రకటించుకొని మరో బాంబు పేల్చారు. వెనిజులాలో అనిశ్చితి నెలకొన్న క్రమంలో ఏకంగా తనను తానే ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా సంచలన ప్రకటన చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో వికీపీడియా పేజీని పోలి ఉన్న స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేస్తూ ఈమేరకు సంచలన ప్రకటన చేశారు ట్రంప్. ట్రంప్ పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

గత కొద్దిరోజులుగా వెనిజులాలో జరుగుతున్న హైడ్రామా గురించి తెలిసిందే. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టే క్రమంలో అమెరికా బలగాలు వెనిజులా రాజధాని కారకాస్ పై మెరుపు దాడులు నిర్వహించడం నాటకీయ పరిణామాలకు దారి తీసింది. అమెరికా బలగాల ఆపరేషన్ లో భాగంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు. దీంతో లాటిన్ అమెరికా దేశాల్లో పెను దుమారం రేగింది.

వెనిజులా అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె 90 రోజుల పాటు అధికారంలో ఉంటారని ప్రకటించింది వెనిజులా రక్షణ శాఖ. వెనిజులా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న ఉత్కంఠ నెలకొన్న క్రమంలో ట్రంప్ ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది.