దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఏడాదిలో తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వివిధ కేటగిరీ అకౌంట్ హోల్డర్లకు గతంలో అందిస్తున్న ఏటీఎం వినియోగ చార్జీలను రివైజ్ చేస్తూ కీలక ప్రకటన చేసింది. దీంతో ఖర్చు పెరగటంతో పాటు ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ కూడా మార్చబడ్డాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఏటీఎం లావాదేవీల మారిన రూల్స్ డిసెంబర్ 1, 2025 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. పెరిగిన ఇంటర్‌ఛేంజ్ ఫీజుల కారణంగా ఏటీఎంలను ఉపయోగించే కస్టమర్లకు వర్తించే సేవా ఛార్జీలను సవరించాల్సి వచ్చినట్లు స్టేట్ బ్యాంక్ పేర్కొంది.
ముఖ్యంగా సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి క్యాష్ విత్‌డ్రాయల్‌కు రూ.23 + GST చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ పేర్కొంది. గతంలో ఈ ఛార్జ్ రూ.21గా ఉండేది. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఛార్జీని గతంలో ఉన్న రూ.10 నుండి రూ.11 + GSTకి పెంచారు.
ఇక శాలరీ అకౌంట్ల విషయంలో పెద్ద మార్పే జరిగింది. గతంలో వీరికి అపరిమిత ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ లిమిట్ ఉండేది. కానీ ఇప్పుడు నెలకు కేవలం 10 ఉచిత లావాదేవీలకు మాత్రమే పరిమితి విధించారు. ఈ పరిమితి దాటితే సేవింగ్స్ ఖాతాదారులకు వర్తించే పెంచిన ఛార్జీలే వీరికి కూడా వర్తిస్తాయి. ఇక కరెంట్ అకౌంట్ హోల్డర్లకు ఎలాంటి ఉచిత లావాదేవీలు ఉండవు. వారు చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌కు పెంచిన ఛార్జీలు చెల్లించాల్సిందే.
అయితే కొన్ని విభాగాలకు ఈ పెంపు నుండి మినహాయింపు లభించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమిత ఉచిత లావాదేవీలను కొనసాగించవచ్చు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్లకు కూడా పాత నిబంధనలే అమల్లో ఉంటాయి. అలాగే YONO యాప్ ద్వారా చేసే కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్ ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇప్పటికీ ఉచితంగానే ఉన్నాయి. కస్టమర్లు అనవసర ఛార్జీల భారం నుంచి తప్పించుకోవటానికి దేశవ్యాప్తంగా ఉన్న 63వేలకు పైగా ఎస్‌బీఐ ఏటీఎంలను, డిపాజిట్ మెషీన్లను ఉపయోగించుకోవాలని బ్యాంకు సూచిస్తోంది.
