ఆసిఫాబాద్/ఆదిలాబాద్/ఇంద్రవెల్లి/నేరడిగొండ/కుంటాల, వెలుగు: స్వాత్రంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతిని ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుపుకొన్నారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడిన మహనీయుడు వడ్డే ఓబన్న అని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్లో ఆయన ఫొటోకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్యోద్యమంలో వడ్డే ఓబన్న ప్రదర్శించిన ధైర్యసాహసాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
అణగారిన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని, ఎన్నో ఉద్యమాల్లో వీరోచిత పోరాటం చేశారని గుర్తుచేశారు. ఆదిలాబాద్జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఏర్పాటుచేసిన ఓబన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవిష్కరించారు. పీడిత వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. పలు చోట్ల వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వడ్డే ఓబన్న ఆశయ సాధన కోసం కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు.
