- ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈబీసీ జాతీయ అధ్యక్షుడు, అగ్రకులాల నిరుపేదల సంఘాల జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని, ఈబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదివారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
ఎస్టీ, బీసీల సంక్షేమానికి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిని అగ్రవర్ణాలలోని నిరుపేదలకు వర్తింపజేయాలని రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అగ్రవర్ణాల వారిలో 90 శాతం మంది నిరుపేదలున్నారని ఆయన గుర్తు చేశారు .
పేరుకే అగ్రవర్ణాలని అడుగడుగునా పేదరికాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. అగ్రవర్ణాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని,ఈబీసీ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్, గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చినట్టుగానే ఈబీసీలకు కూడా వయోపరిమితి సడలింపు ఇవ్వాలని రవీందర్ రెడ్డి కోరారు.
