జానపద గేయ సాహిత్యానికి పునరుజ్జీవం!

జానపద గేయ సాహిత్యానికి పునరుజ్జీవం!

“హితేన సహితం సాహిత్యం”.. సాహిత్యం సమాజ హితాన్ని కోరుకుంటుంది. సలహాలు ఇస్తుంది. సూచనలు చేస్తుంది. ప్రభావం చూపిస్తుంది. సమాజంపై ప్రభావం చూపించడంలో మిగతా ప్రక్రియల కన్నా “పాట” పాత్ర గణనీయం. శ్రమైక సౌందర్యం నుంచి పుట్టిన పాట అలసత్వాన్ని దూరం చేసి, ఆహ్లాదాన్ని కలిగించింది. మారుతున్న కాలంలో “చైతన్య గీతిక”గా మారి ఉద్యమాల్లో తన మరో పార్శ్వాన్ని చూపించింది. 

పాటకు ఉద్యమానికి ఉన్న అవినాభావ సంబంధం, నాటి నుండి నేటి వరకు ఎన్నో ఉద్యమాల్లో “పాట” తన కర్తవ్యాన్ని నిర్వర్తించేలా చేసింది. అప్పటివరకు జనవ్యవహారంలో ఉన్న పాట ప్రసార మాధ్యమాలైన రేడియో, టెలివిజన్​లలో తన ప్రాబల్యాన్ని చూపించింది. కాలక్రమంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞాన మాధ్యమం యూట్యూబ్ వేదికగా పాట శిఖరాగ్ర స్థాయి చేరుకుందనడంలో అతిశయోక్తి లేదు.   

నేటి తెలుగు సాహిత్యంలో పాటకు ఉన్న స్థానం ఏమిటి? అన్న ప్రశ్నకు సినిమా రంగంలోని పాటలకు, కవులకు మాత్రమే ప్రత్యేక గుర్తింపు/స్థానం ఉంది. సినిమా రంగం బయట ఎందరో కవులు, ఎన్నో  పాటలను రాస్తున్నారు. అయినప్పటికీ వారికి లభిస్తున్న గుర్తింపు అత్యల్పం. కవుల సంఖ్య, పాటల సంఖ్యను పెంచడానికి నేటి యువ కవులు నడుంబిగించారనడంలో ఎలాంటి సందేహం లేదు. యూట్యూబ్ మాధ్యమంగా నేటి సమాజ స్థితిని పాట లో కవితాత్మకంగా తెలపడంలో కొందరు సఫలీకృతులు అవుతూ, కొత్త కవులకు మార్గదర్శకులుగా నిలు స్తున్నారు. 

ఇంకొందరు పాటను సృజనాత్మకంగా అందించడంలో తడబడుతున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఒక కవి పాట రాయడానికి,  కళాత్మకంగా తీర్చిదిద్దడానికి సమయం పడుతుంది. దానికి అనుభవం తప్పనిసరి. ఇది అందరూ ఆమోదించాల్సిన విషయం. సమకాలీన కాలంలో యూట్యూబ్ వేదికగా జానపద బాణీల్లో వస్తున్న పాటలు ఉపదేశాన్ని, ఆనందాన్ని అందిస్తున్నాయి. (కొన్ని సంగీతంతో, ఇంకొన్ని సాహిత్యంతో). వాటి ఆంతర్యంలో ఎన్నో వ్యథలు  ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

నేడు పాట అనే ప్రక్రియ జానపద సాహిత్య సంబంధంగా మూడు రూపాల్లో కన్పిస్తుంది. అవి.. కనుమరుగవబోతున్న జానపద గేయ సాహిత్యాన్ని యూట్యూబ్ వేదికగా ఎందరో ఔత్సాహికులు మన ముందు తరం నుంచి సేకరించి లేదా వారిని స్టూడియోలోకి పిలిపించి రికార్డు చేసి భవిష్యత్ తరానికి అందిస్తున్నారు.కనుమరుగైపోయిన వివిధ జానపద పాటల పల్లవి, చరణాలను ఎక్కడో విని వాటిని సేకరించి వాటికి  అనుగుణంగా మిగతా చరణాల్ని పూర్తి చేసి పాటల్ని అందిస్తున్నారు. 

యువ కవులు జానపద బాణీల్లో నేటి సమాజ  స్థితిని పాటల రూపంలో ధ్వనింపజేస్తున్నారు.పాటలో సాహిత్యం కవితాత్మకమైన పంక్తులతో, అలంకారప్రాయమైన పల్లవి, చరణాల రూపంలో ఉంటుంది. పాట ప్రక్రియ ఒకే దృక్పథానికి కట్టుబడి ఉంటుందా? అంటే ఉండదనే  చెప్పాలి. ఒక్కో పాట ఒక్కో దృక్పథం కలిగి ఉంటూ, వివిధ దృక్పథాలను అందరికీ చేరవేయడంలో ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. యూట్యూబ్​లో వస్తున్న పాటల్లో సాహిత్యం ఉందా? లేదా? అనే ప్రశ్న తొలచినప్పుడు కచ్చితంగా ఉందనే చెప్పాలి.యూట్యూబ్ మాధ్యమంలో 2009లో “నిన్నే చూసింది మొదలు” అనే పాటతో జానపద గేయాలు మొదలయ్యాయి. 

అలా మొదలైన పాటల ప్రవాహం నేడు ఉధృతంగా ప్రవహిస్తోంది. విభిన్న అంశాల్లో జానపద పాటలు సాహితీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాయి. తెలంగాణ భాషను, యాసను యువ కవులు చేరదీసి పలుకుబడుల భాష తెలంగాణదని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇటీవల తెలంగాణ నడిబొడ్డున జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో “రాను బొంబాయికి రాను” అంటూ అందాల భామలు తన్మయత్వం చెందడమే దీనికి ఉదాహరణ. దీనితో తెలంగాణ పాట లోకల్ దాటి గ్లోబల్ కి చేరుకుంది. 

యూట్యూబ్ జానపద బాణీల పాటల్లోని సాహిత్యం నిరక్షరాస్యులకూ ఆనందాన్ని, ఉపదేశాన్ని కలిగిస్తుంది. అయితే నేటి సాంకేతికతతో కొందరు వారి స్వలాభాల కోసం, యూట్యూబ్​లో అప్​లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన పాటలను డౌన్​లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుని, ఆ పాటల సంగీతానికి రీమిక్స్ చేస్తున్నారు. ఆ రీమిక్స్ వల్ల ఆ పాటలోని సాహిత్యం మసకబారడం కనపిస్తుంది. 

యూట్యూబ్​లో వస్తున్న పాటలను గమనిస్తే..

భాష 

తెలంగాణ మాండలికానికి, యాసకు అద్దం పట్టే పాటలెన్నో కన్పిస్తాయి. తెలంగాణ భాష సొగసులను వారి పాటల్లో ఇనుమడింప చేయడం గమనించవచ్చు. మామిడి మౌనిక రాసిన  “మోసుకొస్తున్నానే బావ”, “దారి పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు”, తిరుపతి మాట్ల రాసిన “తిన్నా తిరం పడతలే” ముక్క పల్లి శ్రీనివాస్ రాసిన “బంతిపూవుల వాసన నీ బానిన్ల”,  యశ్ పాల్ రాసిన “ఉరికురికి నువ్వు రారో హనుమంతు” (అవ్వ మనవడి పాట) లాంటి పాటలు అనేకం. 

అలంకార సౌందర్యం 

యూట్యూబ్ జానపద పాటల్లో సాధారణంగా కనిపించే శబ్దాలంకారాలు, ఉపమా, ఉత్ప్రేక్ష  అలంకారాలతో  పాటు వ్యాజోక్తి (ఎవ్వారి వాడల్లా పోయినవే భామ), స్తుతి నింద(ఒక్కటే గుద్దు గుద్దిండే), పర్యాయాలంకారం (ఒడియాన రామ ఒల సందమామ), మిథ్యాద్య వ్యత్యాలం కారం  (చిన్ననాడు పెట్టిన చిక్కుడు చెట్టు), తద్గుణాలంకారం (చెక్కెరెంత బుక్కినా చేదు గున్నదవ్వో), సారాలంకారం(మేడంటివి మిద్దంటివి),  ప్రతీప, అతిశయోక్తి మొదలగు అలంకారాలు కన్పిస్తాయి. 

అస్తిత్వం 

తెలంగాణ అనగానే గుర్తొచ్చేది బతుకమ్మ, బోనాలు. వీటి నేపథ్యంగా వచ్చిన పాటలు అనేకం. మిట్టపల్లి సురేందర్ రాసిన “ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి”, కాసర్ల శ్యామ్ రాసిన “కొప్పులోని పువ్వమ్మా” పాటలు, కమల్ ఇస్లావత్ రాసిన “రావు తల్లి రావు తల్లి రేణుకెల్లమ్మో”, మానుకోట ప్రసాద్ రాసిన “సిగమూగుతున్నది జగమంతా” బుర్ర సతీష్ రాసిన- సిలకలాది గట్టు (సేకరణ వనితమ్మ) పాటలే కాకుండా ఎందరో వారి వారి శైలిలో తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పాటలు రాస్తున్నారు. 

సామెతల ప్రయోగం 

రుక్మిణీ నుండి సేకరించి, మల్లేష్ మనుచక్రాల రాసిన పాట ‘మొక్కంగా  మొక్కంగా పుట్టినావే బిడ్డ’. ఈ పాటలో అభిప్రాయభేదాలతో అత్తగారింటి నుండి వచ్చిన బిడ్డకు “పోయి మీద మంటోలే పరుల మాటలుండు”, “పరుల మాటలుండు పాముతీరులెక్క”, “అత్తగారిల్లే వైకుంఠమే నీకు” అని  తల్లి  నచ్చజెప్పే విధానంలో ఎంతో సాహిత్యం కనిపిస్తుంది. ఈ పాటతో పాటు తిరుపతి మాట్ల రాసిన “నాసక్కనోడో”,  నాగం పరుశురామ్ రాసిన “గోల గోల గోల గోల చేసి” , జక్కుల గంగవ్వ నుండి సేకరించిన “ఇంటి ముందట ఉన్న ఏడు కొట్టంలా పెండ”  లాంటి మొదలగు పాటల్లో సామెతల ప్రయోగం కనిపిస్తుంది.  

నుడికార ప్రయోగం

కోమలి పాడిన “కలిగినోరింటికి నన్నిచ్చినావా” పాటలో  కంటి రెప్పల వడ్లు దంచుతున్నవా/, వడ్లు దంచినపొట్టు సిరి పెంట పాలు/ ఆత్మ గల్ల బిడ్డ అల్లుళ్ల పాలు/, పుంటి కూర తిన్న నాది పుట్నిల్లు / తవిటి కుడుములు తిన్న తల్లి గారిల్లు  మొదలగు నుడికారాలతో పాట సాగుతుంది.  

నాటి నుండి నేటి వరకు జనాదరణ పొందిన సాహిత్య ప్రక్రియ పాట. పండిత పామరులను మెప్పించగల లయాత్మకత  కలిగిన ప్రక్రియ పాట. యూట్యూబ్ వేదికగా పాటను అప్​లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన కొన్ని గంటల్లోనే కొన్ని మిలియన్ల వ్యూస్​ పొందడమే దానికి నిదర్శనం. యూట్యూబ్ పాటల్లో హాస్య, శృంగార, కరుణ, శాంత రసాలతో ఉల్లాసాన్ని కల్గించేవి కొన్నైతే, హృదయాన్ని ద్రవింప చేసేవి ఇంకొన్ని. యూత్​తో పాటు అందరూ నేటి యూట్యూబ్ పాటలను ఆస్వాదిస్తున్నారు.ఈ పాటల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పదజాలాన్ని,  గేయసాహిత్యాన్ని  పరిరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించవచ్చు. సేకరణకు, ముద్రణకు నోచుకోని జానపద గేయసాహిత్యాన్ని వెలికి తీయడంలో యూట్యూబ్ పాత్ర ఎంతో కీలకం. 

సాహిత్యం  

“మేడాలొద్దు మిద్దేలొద్దు/ లారీలొద్దు కారులొద్దు
ఆయ్ పాయ్(హై ఫై) సోకులొద్దు/ అయినంగా ఉండుడొద్దూ
సింతాకు పుస్తె కడితే ఓ దొరో/ తాటాకుల గుడిసెలుంట నా దొర”
(తిరుపతి మాట్ల -“ఓ దోరో” పాట) అంటూ నేటి ఆధునిక ప్రపంచంలో ఒక స్త్రీ విలాసవంతంగా జీవించడానికి అవకాశం ఉన్నప్పటికి, తాను కోరుకున్న వాడితోనే  జీవించడానికే మొగ్గు చూపిస్తూ  డబ్బు, ఆభరణాల కన్నా ప్రేమే  ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనే సత్యాన్ని కవి గుర్తుచేశాడు. 
పట్టు పరుపుల మీద పండేటి బిడ్డ /పల్లేరు కాయల్ల పక్కెట్ల పొందే
చీకటింట్లకోతే భయమన్న బిడ్డ  / సీకోటి చింతల్ల సిరసెట్ల పొందే
(దచ్ఛన్న వారింట్లో పాట,  సేకరణ - నక్క లక్ష్మీ ) 
పాలిదాని లెక్క పాలడుగుటేలా?
సాటిదాని లెక్క సగమడుగుటేలా?
(ముక్కపల్లి శ్రీనివాస్ – రాఖీ పాట)
మబ్బులన్ని  మసక బారినాయి బావ / గువ్వలన్ని గూడు జేరినాయి బావ
సుక్కలన్ని సూడ వచ్చినాయి బావ / మల్లెలన్ని వొళ్లు ఇరిసినాయి బావ
(తిరుపతి మాట్ల –“బావో ఓ సారి రావో” పాట)
అని తనను తాను అందంగా అలంకరించుకుని, ఇంటి గలమల్ల ఎదురు చూసే వాసవ సజ్జిక (శృంగార నాయిక) కన్పిస్తుంది.
యూట్యూబ్ పాటల్లో అష్టవిధ శృంగార నాయికలను గమనించవచ్చు.  

- జంగిటి వేణు
పరిశోధక విద్యార్థి
తెలంగాణ యూనివర్సిటీ 9502585333