భారీ వెంచర్ల జోరు..హైఎండ్ అపార్ట్‌‌‌‌మెంట్ల అమ్మకాలూ అదుర్స్ చిన్న ప్లాట్లు, ఇండ్ల కొనుగోళ్లు మాత్రం డీలా

భారీ వెంచర్ల జోరు..హైఎండ్ అపార్ట్‌‌‌‌మెంట్ల అమ్మకాలూ అదుర్స్  చిన్న ప్లాట్లు, ఇండ్ల కొనుగోళ్లు మాత్రం డీలా
  •     2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.11,150 కోట్ల ఆదాయం 
  •     పోయినేడుతో పోలిస్తే 6.20% ఎక్కువ 
  •     కానీ రిజిస్ట్రేషన్ల సంఖ్యలో తగ్గుదల.. 4.07% డౌన్ 
  •     గతేడాది 13.17 లక్షల డాక్యుమెంట్లు.. ఈసారి 12.50 లక్షలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో  విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. భారీ వెంచర్లు, రూ.కోట్లు పలికే హై-ఎండ్ అపార్ట్‌‌‌‌మెంట్ల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతుండగా.. మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే చిన్న ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇండ్ల రిజిస్ట్రేషన్లు మాత్రం భారీగా పడిపోయాయి. 2025–-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్​ నుంచి డిసెంబర్ నాటికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఏకంగా రూ.11,150 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గతేడాదితో పోలిస్తే 6.20 శాతం ఎక్కువ. కానీ రిజిస్ట్రేషన్ జరిగిన డాక్యుమెంట్ల సంఖ్య మాత్రం  12.50 లక్షలకు తగ్గింది. ఇది పోయినేడాదితో పోలిస్తే 4.07 శాతం పడిపోయింది.

ముఖ్యంగా నవంబర్, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఒకప్పుడు సామాన్యులు, చిరుద్యోగులు వాయిదాల పద్ధతిలోనో, పొదుపు చేసిన డబ్బుతోనో చిన్న ప్లాట్లు కొనుగోలు చేసేవారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చిన్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఓపెన్ ప్లాట్ల అమ్మకాలు పూర్తిగా మందగించాయి. కేవలం పెట్టుబడిదారులు, సంపన్నులు మాత్రమే మార్కెట్లో చురుగ్గా పాల్గొంటున్నారని, సామాన్యుడు ఇంటి స్థలం కొనలేని పరిస్థితి నెలకొన్నదని అధికారులు అంటున్నారు. 

చిన్న ఆస్తుల లావాదేవీలు తగ్గినయ్​

రిజిస్ట్రేషన్ల శాఖ వివరాల ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు భారీగానే ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం (2024–-25)లో ఇదే సమయానికి రూ.10,572 కోట్లుగా ఉన్న ఆదాయం, ప్రస్తుత ఏడాదిలో రూ.11,150 కోట్లకు చేరింది. అంటే రూ.578 కోట్ల మేర ఆదాయం పెరిగింది. కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య మాత్రం  తగ్గింది. గతేడాది డిసెంబర్ నాటికి 13.17 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా, ఈ ఏడాది అది 12.50 లక్షలకు పడిపోయింది. అంటే 67 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఆదాయం పెరిగినా, డాక్యుమెంట్లు తగ్గడం.. మార్కెట్‌‌‌‌లో కేవలం అధిక విలువ కలిగిన ఆస్తుల లావాదేవీలు మాత్రమే జరిగాయనేందుకు సంకేతమని నిపుణులు చెప్తున్నారు. సామాన్యులు కొనుగోలు చేసే చిన్న ఆస్తుల లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయని పేర్కొంటున్నారు. గత ఐదేళ్ల డాక్యుమెంట్లను విశ్లేషిస్తే.. సామాన్యులు రియల్ ఎస్టేట్‌‌‌‌కు ఎంత దూరమవుతున్నారో తెలుస్తున్నది. 2021–22లో డిసెంబర్ నాటికి 14 లక్షల డాక్యుమెంట్లు నమోదు కాగా.. 2022–23లో అది 14.58 లక్షలకు పెరిగింది. ఆ తర్వాత 2023–24లో 13.97 లక్షలకు, 2024–25లో 13.17 లక్షలకు, ప్రస్తుతం 2025–26లో ఏకంగా 12.50 లక్షలకు పడిపోయింది. అంటే ఐదేళ్ల క్రితం ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూమ్ ఘోరంగా పడిపోయింది. కేవలం మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు వల్లే ఆదాయం పెరుగుతున్నది తప్ప.. లావాదేవీల సంఖ్య పెరగడం వల్ల కాదని స్పష్టమవుతున్నది. 

రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గడం హెచ్చరికే..

2024–25లో డిసెంబర్ నాటికి 13.03 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా, ఈ ఏడాది(2025–26) 12.50 లక్షలకు పరిమితమయ్యాయి. ఆదాయం మాత్రం రూ.10,497 కోట్ల నుంచి రూ.11,148 కోట్లకు ఎగబాకింది. ఇంకా ఆర్థిక సంవత్సరం ముగియడానికి జనవరి, ఫిబ్రవరి, మార్చి మాత్రమే మిగిలి ఉన్నాయి. సాధారణంగా మార్చి నెలలో రిజిస్ట్రేషన్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 2021–22 మార్చిలో 1.94 లక్షలు, 2024–25 మార్చిలో 1.62 లక్షల డాక్యుమెంట్లు నమోదయ్యాయి. మరి ఈసారి ఆ స్థాయికి చేరుకుంటుందా? లేదా? అనేది చూడాలి.  ఒకవేళ మార్చిలో ఆదాయం పెరిగినా, అది కేవలం బడా వెంచర్ల రిజిస్ట్రేషన్ల వల్లే తప్ప.. సామాన్యుల భాగస్వామ్యం ఇందులో పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు. డాక్యుమెంట్ల సంఖ్య నానాటికీ పడిపోతుండటం సీరియస్‌‌‌‌గా తీసుకోవాల్సిన విషయమేనని అధికారులు చెబుతున్నారు. ఆదాయంతో పాటు రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా ముఖ్యమని అంటున్నారు. డాక్యుమెంట్ల సంఖ్య 12 లక్షలకు తగ్గిందంటే.. వేలాది మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, చిన్న వెంచర్ల నిర్వాహకులు ఉపాధి కోల్పోతున్నట్లేనని ఎక్స్​పర్ట్స్​విశ్లేషిస్తున్నారు.  

మే, జులైలో మస్తు.. డిసెంబర్‌‌‌‌లో డీలా 

నెలల వారీగా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని పరిశీలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో మే, జులై నెల్లోలో అత్యధిక ఆదాయం వచ్చింది. మేలో రూ.1,390 కోట్లు, జులైలో రూ.1,351 కోట్ల ఇన్‌‌‌‌కమ్ సమకూరింది. అయితే నవంబర్, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో డాక్యుమెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో కేవలం 0.99 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్ (1.28 లక్షలు)తో పోలిస్తే ఇది -13.16 శాతం తక్కువ. అయినప్పటికీ  ఆదాయం మాత్రం డిసెంబర్‌‌‌‌లో రూ.1,240 కోట్లు వచ్చింది (గతేడాది డిసెంబర్ రూ.1,047 కోట్లు). డాక్యుమెంట్లు తగ్గినా ఆదాయం 27.52 శాతం పెరగడమంటే.. ఆ నెలలో జరిగినవన్నీ భారీ విలువ కలిగిన కమర్షియల్ స్థలాలు లేదా హై-ఎండ్ విల్లాల రిజిస్ట్రేషన్లే అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి