పత్తికి రికార్డు రేటు..క్వింటాలు రూ. 9000

పత్తికి రికార్డు రేటు..క్వింటాలు రూ. 9000

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో పత్తి మస్తు రేటు పలుకుతోంది. తెల్ల బంగారం ధర రోజురోజుకూపెరుగుతోంది. గత రెండ్రోజుల్లో అత్యధికంగా క్వింటాల్ పత్తి రూ.8,800 నుంచి రూ.9 వేలకు అమ్ముడుపోయింది. ఇట్లనే డిమాండ్ ఉంటే రానున్న రోజుల్లో రూ.10 వేలు పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతు న్నాయి. ఖమ్మం మార్కెట్​లో మంగళ, బుధవారాల్లో గరిష్టంగా క్వింటాల్ పత్తి రూ.9 వేలు పలికింది. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు. రైతులు మొత్తం 6,318 బస్తాలను మార్కెట్​కు తీసుకురాగా.. కొనుగోలు చేసేందుకు ఆన్ లైన్ బిడ్డింగ్ లో వ్యాపారులు పోటీ పడ్డారు. తేమ ఆధారంగా రూ.7 వేలు మొదలుకొని రూ.9 వేల వరకు పెట్టారు. వరంగల్‍ ఏనుమాముల మార్కెట్లోనూ గత మూడ్రోజులు పత్తికి మంచి రేటు వచ్చింది. 
సోమ, మంగళవారాల్లో గరిష్టంగా రూ.8,515, రూ.8,715 పలుకగా.. బుధవారం రూ.8,800లకు పెరిగింది. ఈ సీజన్ లో ఇదే అత్యధికం. మార్కెట్ కు రోజూ దాదాపు 6 వేల క్వింటాళ్లకు పైగా పత్తి వస్తోంది. మంగళవారం వరకు 3,56,690 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. ఇక మహబూబాబాద్ లో క్వింటాల్ పత్తికి గరిష్టంగా రూ.8,891, పెద్దపల్లిలో రూ.8,833, గజ్వేల్‍లో రూ.8,819, జమ్మికుంటలో రూ.8,800, ఆదిలాబాద్‍లో రూ.8,520 పలికింది. 
ఇంటర్నేషనల్ ఆర్డర్లు పెరిగినయ్..  
మన రాష్ట్రంలో పండించే పత్తికి నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ బ్రాండెడ్ బట్టల్లో తెలంగాణ కాటన్ వాడతారని అధికారులు చెబుతున్నారు. ఇక్కడి పత్తి గింజ సైజ్‍ పొడవుగా, గట్టిగా ఉంటుందని.. అందుకే మన పత్తి బేళ్లకు, గింజలకు డిమాండ్ ఉంటోందని పేర్కొన్నారు. మరోవైపు చైనా, పాకిస్తాన్‍, బంగ్లాదేశ్‍ లలో పత్తి ఉత్పత్తి తగ్గిపోయింది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లు మూతపడిన టెక్స్ టైల్ ఇండస్ట్రీలు మెల్లిగా ఓపెన్ అవుతున్నాయి. దీంతో చైనా, యూరప్‍, ఫ్రాన్స్, అమెరికాల నుంచి కాటన్ ఆర్డర్లు పెరిగాయి. 
తగ్గిన దిగుబడి...  
ఈసారి పత్తి దిగుబడి తగ్గింది. పలుచోట్ల భారీ వర్షాలు కురవడం, ఎర్ర తెగులు సోకడంతో పంట దెబ్బతింది. కొన్నిచోట్ల నకిలీ విత్తనాలు రైతుల కొంపముంచాయి. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల పత్తి వస్తుందని ఆశించగా.. 5 నుంచి 6 క్వింటాళ్లు దాటడం లేదు. దిగుబడి భారీగా తగ్గడంతోనూ పత్తికి డిమాండ్ పెరిగింది. దీంతో కాటన్‍ కార్పొరేషన్‍ ఆఫ్‍ ఇండియా(సీసీఐ) నిర్ణయించిన మద్దతు ధర రూ.6,025 కంటే ఎక్కువిచ్చి మరీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. క్వాలిటీ కాటన్ కనిపిస్తే చాలు, దానికి ఎంతైనా రేటు పెట్టడానికి ముందుకొస్తున్నారు. మన రాష్ట్రంలో పత్తి కొనేందుకు గుజరాత్‍ వ్యాపారులు సైతం వస్తున్నారు. రానున్న రోజుల్లో కాంపిటీషన్ పెరిగితే పత్తి రేటు రూ.10 వేలకు కూడా చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.  
ఫస్ట్ టైమ్ ఇంత రేటుంది.. 
ఈసారి పత్తి రైతులకు కలిసొచ్చింది. పత్తికి ఇంత రేటు ఉండడం ఇదే ఫస్ట్ టైమ్. నేను మూడెకరాల్లో పత్తి వేశా. 15 క్వింటాళ్ల దాకా పండింది. నాకు ఎక్కువల ఎక్కువ రూ.8,300 ధర వచ్చింది. ఇప్పుడైతే రూ.8,800 పలుకుతోంది.  - జూలపల్లి సురేందర్ రావు, పర్వతగిరి, వరంగల్ జిల్లా 
క్వింటాల్ రూ.8,800లకు అమ్మిన..  
వరంగల్ ఏనుమాముల మార్కెట్​కు 16 బస్తాల పత్తి తీసుకొచ్చిన. క్వింటాల్​రూ.8.800 పలికింది. ఈ సీజన్‍లో పంట మంచిగా పండితే, ఇంకా బాగుండేది. నకిలీ విత్తనాలు, తెగుళ్ల బాధ లేకుండా.. ఏటా ఇదే ధర ఉంటే రైతులకు మేలు జరుగుతుంది. - చిర్ర గణేశ్‍, హసన్‍పర్తి, హన్మకొండ జిల్లా