హైదరాబాద్, వెలుగు: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూసీజీ) విధానంలో నాలుగు బొగ్గు గనుల అభివృద్ధి ఒప్పందాలపై (సీఎండీపీఏ) సంతకాలు చేసింది.వాణిజ్య బొగ్గు గనుల వేలంలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లోని రేచర్ల, చింతలపూడి సెక్టార్ ఏ1 గనులను దక్కించుకుంది. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఒడిశాలోని బెల్ పహార్ డిప్ ఎక్స్టెన్షన్, తంగర్దిహి ఈస్ట్ గనులను సాధించింది.
సంప్రదాయ పద్ధతిలో గనుల తవ్వకం సాధ్యం కాని చోట భూమి లోపలే బొగ్గును సింథటిక్ గ్యాస్‌గా మార్చడం ఈ యూసీజీ సాంకేతికత ప్రత్యేకత. దీనివల్ల లోతైన గనుల నుంచి కూడా ఇంధనాన్ని పొందవచ్చు. ఈ గ్యాస్ నుంచి యూరియా, అమ్మోనియా తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఉత్పత్తి చేయవచ్చు.
ఇప్పటి వరకు వాణిజ్య వేలంలో 138 గనుల ఒప్పందాలు పూర్తయ్యాయి. వీటి ద్వారా రూ.42,980 కోట్ల వార్షిక ఆదాయం వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్టుల వల్ల రూ.48,231 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 4.34 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

