ప్రజల ప్రాణాలే ముఖ్యం: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. 70% తగ్గనున్న క్యాన్సర్ మందు ధర !

ప్రజల ప్రాణాలే ముఖ్యం: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..  70% తగ్గనున్న క్యాన్సర్ మందు ధర !

క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వాడే ఖరీదైన మందు 'నివోలుమాబ్' (Nivolumab) విషయంలో ఢిల్లీ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. దింతో ఈ మెడిసిన్ వాడే వారికీ  వేల రూపాయల ఖర్చు తగ్గే అవకాశం ఉంది.

విషయం ఏంటంటే :
అమెరికాకు చెందిన బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ (BMS) అనే కంపెనీ ఈ మందును తయారు చేస్తుంది. అయితే భారతీయ కంపెనీ 'జైడస్ లైఫ్‌సైన్సెస్' (Zydus Lifesciences) దీనికి సమానమైన బయోసిమిలర్ అనే మందును తయారు చేసి, చాలా తక్కువ ధరకే విక్రయించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దింతో  విదేశీ కంపెనీ అమ్మే ధర కంటే జైడస్ కంపెనీ తయారు చేసిన మందు 70 శాతం తక్కువ ధరకే లభిస్తుంది.

 ఈ మందు పేటెంట్ హక్కులు 2026 వరకు మాత్రమే  ఉన్నాయని గతంలో అమ్మకాలను ఆపేశారు. కానీ, రోగుల ప్రాణాలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఈ మందును అమ్మడానికి ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు పచ్చజెండా ఊపింది. ఈ మందుని ఊపిరితిత్తుల క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, స్కిన్  క్యాన్సర్  కోసం  వాడుతారు.

ఇదొక ఒక 'ఇమ్యునోథెరపీ' మందు. అంటే మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేస్తుంది. ఇది కీమోథెరపీ కంటే చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ మందుల కోసం ఒక్కో కోర్సుకు లక్షల రూపాయలు ఖర్చవుతాయి. సామాన్య కుటుంబాలకు ఇది అత్యంత  భారంగా మారుతోంది. జైడస్ కంపెనీ తక్కువ ధరకే మందును తేవడం వల్ల, వేల మంది ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తుంది.

గతంలో, హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ జైడస్ మందుని అమ్మకుండా నిరోధిస్తూ.... నివోలుమాబ్ పేటెంట్ మే 2026 వరకు చెల్లుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ప్రాణాలను రక్షించే మందులకు సంబంధించిన కేసులలో కోర్టులు ప్రజా ప్రయోజనం, రోగుల సంక్షేమం వైపు మొగ్గు చూపాలని చెప్పింది. ఈ తీర్పు క్యాన్సర్ రోగులకు చాల ఖర్చు భారం తగ్గిస్తుందని భావిస్తున్నారు.