బాయిల్డ్ రైస్ విషయంలో రాష్ట్ర సర్కారుకు ఊరట 

బాయిల్డ్ రైస్ విషయంలో రాష్ట్ర సర్కారుకు ఊరట 
  • రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతి 
  • ఇప్పటికే 6 లక్షల టన్నులకు గ్రీన్ సిగ్నల్ 
  • తాజా అనుమతితో కలిపి మొత్తం14 లక్షల టన్నులకు ఓకే 

హైదరాబాద్‌‌, వెలుగు: యాసంగి వడ్లకు సంబంధించి మరో 8 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌‌ ను తీసుకునేందుకు కేంద్రం గురువారం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. దీంతో బాయిల్డ్‌‌ రైస్‌‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించినట్లయింది. యాసంగిలో 50.66 లక్షల టన్నుల వడ్లను రాష్ట్ర సర్కారు రైతుల నుంచి కొనుగోలు చేసింది. అయితే కేంద్రం రారైస్‌‌ మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర సర్కారు బాయిల్డ్‌‌ రైస్‌‌ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. కేంద్రం దిగిరాకపోవడంతో రాష్ట్ర సర్కారు వరి వేయొద్దంటూ రైతులకు సూచించింది. చివరకు ధాన్యం కొనుగోళ్ల సమయంలో నూక శాతం నష్టాన్ని తామే భరిస్తామని చెప్పి వడ్లు సేకరించింది. కేంద్రం పోషక విలువలున్న ఫోర్టిఫైడ్‌‌ రైస్ ను దేశవ్యాప్తంగా పలు ట్రైబల్‌‌ జిల్లాల్లో పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో బాయిల్డ్‌‌ రైస్‌‌ స్థానంలో ఫోర్టిఫైడ్‌‌ రైస్‌‌ తీసుకోవాలని రాష్ట్ర సివిల్‌‌ సప్లయ్స్‌‌ అధికారులు కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్రం మే 11న 6.05 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌‌ రైస్‌‌ తీసుకోవడానికి అంగీకారం తెలిపింది. తాజాగా మరో 8 లక్షల టన్నుల ఫోర్డిఫైడ్ రైస్ కు ఓకే చెప్పింది.  

తడిసిన ధాన్యాన్నీ వాడుకోవచ్చు.. 

రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా మిల్లుల్లో నిరుడు యాసంగి,  వానాకాలం, ఈ ఏడు యాసంగి సీజన్ లకు కలిపి 91 లక్షల టన్నుల వడ్ల నిల్వలు ఉన్నాయి. ఇటీవల వర్షాలకు 4.94 లక్షల టన్నుల వడ్లు తడిసినట్లు సివిల్‌‌ సప్లయ్స్‌‌ పరిశీలనతో తేలింది. ఈ వడ్లు రారైస్‌‌ మిల్లింగ్‌‌ చేయడానికి ఏమాత్రం పనికి రావని గుర్తించారు. దీనికి బాయిల్డ్‌‌ రైస్‌‌ మాత్రమే పరిష్కారం కాగా, బాయిల్డ్‌‌ రైస్‌‌ను ఫోర్టిఫైడ్‌‌ రైస్‌‌గా మార్చుకునే వెసులుబాటు ఉంది. దీంతో గత యాసంగిలో సేకరించిన 50.66 లక్షల టన్నుల వడ్లలో కనీసం 20 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌‌ రైస్‌‌ తీసుకోవాలని రాష్ట్ర సివిల్‌‌ సప్లయ్స్‌‌ అధికారులు జులై 30న కేంద్రానికి లేఖ రాశారు. స్పందించిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖ కార్యదర్శి అశోక్‌‌కుమార్‌‌ వర్మ గురువారం 8 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌‌ రైస్‌‌ తీసుకోవడానికి అంగీకారం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మొదట అనుమతించిన 6.05 లక్షల టన్నులతో పాటు తాజా అనుమతులతో కలిపి మొత్తం14.05 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌‌ రైస్‌‌ సేకరణకు కేంద్రం నుంచి గ్రీన్‌‌ సిగ్నల్‌‌ లభించింది.