అదృశ్యమై.. చెరువులో శవమై..అనుమానాస్పదంగా గజ్వేల్ వాసి మృతి

అదృశ్యమై.. చెరువులో శవమై..అనుమానాస్పదంగా గజ్వేల్ వాసి మృతి

మీర్ పేట్, వెలుగు: అదృశ్యమైన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన సర్వ చిరంజీవి(45)  ఇంటర్​నెట్ షాప్​నిర్వహిస్తున్నాడు. ఈ నెల 24న సాయంత్రం గోవా వెళ్తున్నానని భార్యకు చెప్పి బయలుదేరాడు. 27న అతనికి ఫోన్​చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. కుటుంసభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గజ్వేల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 

దీంతో పోలీసులు మిస్సింగ్​కేసు నమోదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో శామీర్ పేట్​పోలీసులు గజ్వేల్​ఠాణాకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు చిరంజీవి అల్లుడు మహంకాళి ఉదయ్ కుమార్​ను పంపించగా.. అతను సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహం తన మామదేనని గుర్తించాడు. ఆర్థిక లేదా ఇతర కారణాల వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చిన ప్రాథమికంగా అంచనాకు వచ్చామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.