ల్యాండ్​ పూలింగ్​ను నిరసిస్తూ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ నిర్బంధం

ల్యాండ్​ పూలింగ్​ను నిరసిస్తూ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ నిర్బంధం

తూప్రాన్, వెలుగు: ల్యాండ్​ పూలింగ్​ను నిరసిస్తూ భూ సేకరణకు వచ్చిన రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ను గ్రామ పంచాయతీలో నిర్బంధించారు. ఈ ఘటన గురువారం ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్ పరిధిలోని మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇమాంపూర్ లో జరిగింది. గ్రామం 44వ నెంబర్​ నేషనల్ హైవేకు  పక్కనే వుండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నెంబర్​100లో ఉన్న 97.27 ఎకరాల అసైన్డ్​ భూమిని ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రైతులనుంచి సేకరించి డెవలప్ చేయాలని అధికారులు నిర్ణయించారు. కొన్నాళ్లుగా ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో ల్యాండ్ పూలింగ్​ కోసం భూ సేకరణకు సంబంధించి గ్రామ సభ  ఏర్పాటు చేసేందుకు తూప్రాన్ మండల రెవెన్యూ ఇన్​స్పెక్టర్​నగేశ్​తో పాటు పలువురు ఆఫీసర్లు ఇమాంపూర్​వచ్చారు.  

విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పంచాయతీ ఆఫీస్​ వద్దకు తరలివచ్చారు. భూ సేకరణ చేపట్టొద్దంటూ ఆందోళనకు దిగారు. గ్రామ సభ నిర్వహణకు వచ్చిన రెవెన్యూ ఇన్​స్పెక్టర్​నగేశ్​ను గ్రామ పంచాయతీ ఆఫీస్​లో నిర్బంధించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటూ బతుకుతున్నామని, ల్యాండ్​పూలింగ్​పేరిట భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు గ్రామ పంచాయతీ పాలకవర్గసభ్యులతో చర్చించి రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ను విడుదల చేయించారు.