ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ నిఘా

ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ నిఘా

రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనాలపై కొరడా ఝుళిపిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. ప్రైవేట్ ట్రావెల్స్ పై నిఘా పెట్టడంతో పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి బస్సులను సీజ్ చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాలకు పర్మిట్, లైసెన్స్ తో పాటు ఫైర్ సేఫ్టీ కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.  సంక్రాంతి సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా, విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు. 10 టీంలుగా విడిపోయి హైదరాబాద్ తో పాటు శివార్లలో తనిఖీలు చేస్తున్నారు.

శంషాబాద్ లో బెంగుళూరు- హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర చెకింగ్స్ చేస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేసిన 5 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. ఏపీ, కర్నాటకతో పాటు వివిధ ఏరియాలకు వెళ్లే వాహనాలపై నిఘా ఉంచారు. 25 వెహికిల్స్ పై కేసులు బుక్ చేశారు. పండుగ టైంలో ఎక్కువ బస్సులు నడపడం, పరిమితికి మించి జనాన్ని తీసుకెళ్లడంపై ఫోకస్ పెడుతున్నామన్నారు అధికారులు. ఈ నెల 7న చేపట్టిన స్పెషల్ డ్రైవ్ 17 వరకు కొనసాగుతుంది. అధిక చార్జీలు, పర్మిట్, లైసెన్స్ లేకపోవడం, నిషేధిత వస్తువులను క్యారీ చేయడం లాంటి కేసులను ఎక్కువగా గుర్తించామని తెలిపారు. పండుగల టైంలోనే ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తూ మిగతా సమయంలో పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకొని, ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు జనం.