అక్రమాలకు అడ్డా చంద్రబాబు ఇల్లు..  అక్కడ ఎలా ఉంటున్నారు..

అక్రమాలకు అడ్డా చంద్రబాబు ఇల్లు..  అక్కడ ఎలా ఉంటున్నారు..

కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు అక్రమాలకు అడ్డా వంటిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అక్రమ కట్టడంలో చంద్రబాబు ఎలా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. కృష్ణా నదిని ఆక్రమించిన కట్టడంలో నివసిస్తూ అక్రమ కట్టడాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా పొందారని చంద్రబాబుపై అభియోగాలు మోపారు. సీఐడీ అటాచ్‌మెంట్ పై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

క్విడ్ ప్రోకో

టీడీపీ హయాంలో చంద్రబాబు, నారాయణ తమ పదవులను దుర్వినియోగపరిచి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణలో భాగంగా చర్యలు చేపట్టారని సజ్జల అన్నారు. చట్టాలను ఉల్లంఘించినట్టు విచారణలో తేలిందన్నారు.  అక్రమాలకు చిరునామా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు.. ఆ అక్రమ కట్టడంలో చంద్రబాబు ఏ హోదాలో ఉంటున్నారో అర్థం కావట్లేదన్నారు.

ఉచితంగా ఇస్తారా?

చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇంటి అలవెన్సు పొందుతున్నారు. కానీ, ఎక్కడా అద్దెకు తీసుకున్నట్లు ఒప్పందాలు లేవన్నారు సజ్జల.  లింగమనేని రమేష్ ఆ ఇంటిని దేశభక్తితో ప్రభుత్వానికి ఇచ్చినట్లు కోర్టుకు చెప్పారన్న ఆయన.. మరి చంద్రబాబు అధికారం పోయిన తర్వాత కూడా అదే ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారు? అని నిలదీశారు.  పేదల, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని.. కపటత్వానికి చంద్రబాబు ప్రతినిధి అని ఆరోపించారు.ఈ కుట్రల పట్ల మనం అందరం అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి  సూచించారు.