21 డకౌట్ల తర్వాతే జట్టు నుంచి తీసేస్తానని హెడ్ కోచ్ గంభీర్ చెప్పారు: సంజూ శాంసన్

21 డకౌట్ల తర్వాతే జట్టు నుంచి తీసేస్తానని హెడ్ కోచ్  గంభీర్  చెప్పారు: సంజూ శాంసన్

న్యూఢిల్లీ: తన కెరీర్‌‌ గాడిలో పడేందుకు టీమిండియా టీ20 కెప్టెన్‌‌ సూర్యకుమార్‌‌ యాదవ్‌‌, హెడ్‌‌ కోచ్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ అండగా ఎలా నిలిచారో స్టార్‌‌ ప్లేయర్‌‌ సంజూ శాంసన్‌‌ గుర్తు చేసుకున్నాడు. ఆంధ్రాలో దులీప్‌‌ ట్రోఫీ సందర్భంగా సూర్య తన వద్దకు వచ్చి ఇచ్చిన మాట ఇంకా గుర్తుందని చెప్పాడు. వరుసగా ఏడు మ్యాచ్‌‌ల్లో తాను ఓపెనర్‌‌గా ఆడతాడని అప్పట్లో సూర్య చెప్పిన మాటలను అశ్విన్‌‌తో జరిగిన యూ ట్యూబ్‌‌ చానెల్‌‌లో శాంసన్‌‌ వెల్లడించాడు. ఆ హామీ తన ఆటతీరును చాలా మార్చిందన్నాడు. 

అయితే శ్రీలంక టూర్‌‌లో తొలి రెండు మ్యాచ్‌‌ల్లో డకౌటైన తర్వాత పరిస్థితి మళ్లీ గందరగోళంలో పడిందన్నాడు. తాను ఏం తప్పు చేస్తున్నానో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కోచ్ గంభీర్ అండగా నిలిచాడన్నాడు. ‘21 డకౌట్ల తర్వాతే నిన్ను జట్టు నుంచి తొలగిస్తా. అంతవరకు స్వేచ్ఛగా ఆడు’ అని ధైర్యం నింపాడని వెల్లడించాడు. ఈ కాన్ఫిడెన్స్‌‌ తనకు ఇందనంగా మారిందన్నాడు. ఈ క్రమంలో కేవలం ఐదు టీ20 మ్యాచ్‌‌ల్లోనూ మూడు సెంచరీలు కొట్టి కోచ్‌‌ నమ్మకాన్ని నిలబెట్టాడు. 

ఇందులో ఒకటి బంగ్లాదేశ్‌‌పై, రెండు సౌతాఫ్రికాపై సాధించాడు. ఒకే క్యాలెండర్‌‌ ఏడాదిలో ఏ బ్యాటర్‌‌ కూడా ఈ రికార్డును సాధించలేదు. కోచ్, కెప్టెన్  అండతో తన ఇంటర్నేషనల్ కెరీర్‌‌ను నిలబెట్టుకున్న శాంసన్‌‌..  ఐపీఎల్ ఫ్యూచర్‌‌ను మాత్రం ప్రమాదంలో పడేసుకుంటున్నాడు. రెండేళ్ల సస్పెన్షన్‌‌ తర్వాత రాజస్తాన్‌‌ రాయల్స్‌‌తో జత కట్టిన శాంసన్‌‌.. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీని వీడేందుకు సిద్ధమయ్యాడు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.