
కంది, వెలుగు : జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో సక్సెస్ చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు ఆఫీసులో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంపై వైద్య ఆరోగ్యశాఖ, అనుబంధ శాఖల ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది గ్రామాల వారీగా, ఆరోగ్య ఉప కేంద్రాల వారీగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా ఆయా వ్యాక్సినేషన్ మిస్ అయిన పిల్లలు, గర్భిణుల లిస్టును తయారు చేసుకోవాలన్నారు. ఏ రోజు ఎక్కడ వ్యాక్సినేషన్ ఇస్తారో ఆ సమాచారం తెలియజేసి వారికి వ్యాక్సిన్ అందించాలని చెప్పారు.
మిషన్ ఇంద్రధనుష్లో భాగంగా వ్యాక్సినేషన్లు నిర్ణీత సమయంలో తప్పిపోయిన వారికి సెప్టెంబర్ లో 11 నుంచి 16 వరకు, అక్టోబర్లో 9 నుంచి14 వరకు వేస్తారని తెలిపారు. ఆయా టీకాలను మరిచిపోకుండా ఇప్పించేలా పట్టణ, గ్రామ ప్రాంతాలలో ఐకేపీ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసర్ డాక్టర్ గాయత్రీ దేవి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్ఓ నగేశ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, డీడబ్ల్యూఓ పద్మావతి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓలు, ఇమినైజేషన్ అధికారి డాక్టర్ శశాంక్, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.