మక్కా, మదీనాలో ప్రార్థనలపై ఆంక్షల ఎత్తివేత

మక్కా, మదీనాలో ప్రార్థనలపై ఆంక్షల ఎత్తివేత
  • పూర్తి స్థాయిలో యాత్రికులకు అనుమతిచ్చిన సౌదీ అరేబియా   
  • ప్రార్థనకు వచ్చేటప్పుడు మాస్కు ధరించడం తప్పనిసరి

మక్కా, మదీనా యాత్రికులు, భక్తులపై విధించిన ఆంక్షలను ఎత్తివేశారు. దాదాపు ఏడాదిన్నరగా అమలు చేస్తున్న కఠినమైన ఆంక్షల్లో చాలా వరకు ఎత్తివేస్తూ సౌదీ అరేబియా ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి మక్కాలో పూర్తి స్థాయిలో యాత్రికులను అనుమతిస్తున్నారు. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వేసుకున్న విదేశీయులందరికీ అనుమతిస్తున్నారు. అలాగే సామాజిక దూరం పాటించాలన్న నిబంధనను కూడా ఇవాళ ఉదయం నమాజ్‌ నుంచి తొలగించారు. అంతేకాదు బయట తిరిగేటప్పుడు మాస్క్ ధరించాలన్న నిబంధనతోపాటు సోషల్ డిస్టెన్స్ నిబంధనకూడా తొలగించారు. అయితే ప్రార్థనకు హాజరయ్యేటప్పుడు మాత్రం మాస్కు ధరించడం తప్పనిసరి చేశారు.  
ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో మక్కా మదీనాలో అంటించిన కరోనా నిబంధనల స్టిక్కర్లను తొలగించారు. కాబా, మదీనా ప్రార్థనా మందిరాల వద్దకు వెళ్లేవారు తమ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారం అధికారులకు ఇవ్వాలి. 3.48 కోట్ల జనాభా ఉన్న సౌదీ అరేబియా దేశంలో 2.06 కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్న నేపథ్యంలో ఆంక్షలను ఎత్తివేశారు. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గినందున ఇప్పటి వరకు అమలు చేసిన ఆంక్షలన్నీ ఎత్తేశారు.