హిడ్మా టార్గెట్‌గా ‘ఆపరేషన్‌ మాన్‌సూన్’.. కదలికలు పసిగట్టిన బలగాలు

హిడ్మా టార్గెట్‌గా ‘ఆపరేషన్‌ మాన్‌సూన్’.. కదలికలు పసిగట్టిన బలగాలు
  • చత్తీస్‌గఢ్ ​ఇంద్రావతి నేషనల్‌ పార్క్ ఏరియాలో భారీ కూంబింగ్​
  • 25 వేల మంది బలగాలతో అణువణువూ జల్లెడ.. దండకారణ్యంలో టెన్షన్ 
  • పోలీసుల చేతుల్లో అగ్రనేతల లొకేషన్స్​
  • లొంగిపోకపోతే ఎన్‌కౌంటరే.. బస్తర్​ ఐజీ హెచ్చరిక

భద్రాచలం, వెలుగు: ‘ఆపరేషన్ కగార్‌‌’లో భాగంగా చత్తీస్​గఢ్​ సర్కారు​వర్షాకాలంలోనూ కూంబింగ్​ నిర్వహిస్తున్నది. హిడ్మాలాంటి అగ్రనేతలే టార్గెట్​గా ‘ఆపరేషన్​మాన్‌సూన్’​ పేరిట భద్రతా బలగాలను రంగంలోకి దించింది. దీంతో దండకారణ్యంలో టెన్షన్​ నెలకొన్నది. బస్తర్​ ఐజీ సుందర్​రాజ్ ఇటీవల చేసిన ప్రకటన మావోయిస్టు వర్గాల్లో కలకలం రేపుతున్నది. తమ చేతుల్లో మావోయిస్టు అగ్రనేతల లొకేషన్స్ ఉన్నాయని, వారు లొంగిపోకపోతే  ఎన్‌కౌంటర్​అవుతారని ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఆయన అన్నట్లుగానే ఇంద్రావతి నేషనల్‌ పార్క్​ ఏరియాను 25 వేల మంది బలగాలతో జల్లెడ పడుతున్నారు.  మావోయిస్టు​ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, మిలిటరీ చీఫ్,​ హిడ్మా శిష్యుడు దేవ కదలికలను గుర్తించారు. వారిని లక్ష్యంగా చేసుకొని కూంబింగ్​ ఆపరేషన్​ జరుగుతున్నట్లుగా తెలుస్తున్నది. దీనికితోడు మావోయిస్టు దళపతి గణపతి, కేంద్ర కమిటీ సభ్యులు సుజాత, పుల్లూరి ప్రసాదరావు సమాచారం కూడా కేంద్ర నిఘా వర్గాలు కనిపెట్టినట్లుగా ప్రచారం జరుగుతున్నది. 

హిడ్మా కదలికలు పసిగట్టిన బలగాలు
చత్తీస్​గఢ్​ పోలీసులు, కేంద్ర బలగాల ప్రధాన టార్గెట్​ హిడ్మానే. ఆయన ఆచూకీ కోసం ఏళ్ల తరబడి బలగాలు అన్వేషిస్తున్నాయి. భూ ఉపరితలానికి 1500 అడుగుల ఎత్తులో హైరెజిల్యూషన్​ డ్రోన్​ కెమెరాలతో అతడి కదలికలను భద్రతా బలగాలు పసిగడుతున్నట్టు తెలుస్తున్నది. కర్రెగుట్టల్లో దొరికినట్లే దొరికి హిడ్మా తప్పించుకున్నాడు.

ఇంద్రావతి నేషనల్​ పార్కు ఏరియాలోనే వీరి జాడను కనిపెట్టిన భద్రతా బలగాలు ‘ఆపరేషన్​ మాన్‌‌‌‌‌‌‌‌సూన్’​ పేరిట కూంబింగ్ ​తీవ్రం చేశాయి. ఈ క్రమంలో చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో ఫైరింగ్​పై స్పందించాలని పౌరహక్కుల సంఘాలకు ప్రొఫెసర్​ హరగోపాల్​సూచించారు. బస్తర్ ఐజీ సుందర్​రాజ్​ పి ప్రకటనను కూడా ఆయన ప్రస్తావించారు.  ప్రజాస్వామ్య వ్యతిరేక కాల్పులను ఆపివేయాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి.