యాదిలో..సర్వెంట్ ఆఫ్ ఇండియా ...గోపాల కృష్ణ గోఖలే చరిత్ర ఇదే..!

యాదిలో..సర్వెంట్ ఆఫ్ ఇండియా ...గోపాల కృష్ణ గోఖలే  చరిత్ర ఇదే..!

గోపాల కృష్ణ గోఖలే 1866 మే 9న రత్నగిరి జిల్లా, చిప్లున తాలుకా కత్లుక్ అనే కుగ్రామంలో ‘రాస్తే’ వంశంలో జన్మించాడు. ఆయన పూర్వీకులు పీష్వాల దగ్గర పనిచేశారు. తల్లిదండ్రులు గోపాల కృష్ణను, తన అన్న గోవింద్​తోపాటు సెకండరీ ఎడ్యుకేషన్ కోసం కొల్హాపూర్ పంపారు. ఆ తర్వాత మూడేండ్లకు తండ్రి మరణించడంతో అన్న గోవింద్​ చదువు మధ్యలోనే వదిలేసి కొల్హాపూర్​లో ఒక పనిలో చేరాడు. 

తమ్ముడు తనలా కష్టపడకూడదని అతనికొచ్చే15 రూపాయల్లో రూ. 8 గోపాల్​కు పంపేవాడు. అన్న పంపిన డబ్బుతో ఒక్కపూటే వండుకుని తిని, వీధి దీపాల వెలుతురులో చదువుకునేవాడు గోపాల్. అలా1818లో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసి, సెకండ్ క్లాసులో పాసైన ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్​లో చేరాడు. 

పూణెలోని న్యూ ఇంగ్లిష్​ హైస్కూల్లో అసిస్టెంట్ మాస్టర్​షిప్ తీసుకున్నాడు. అప్పుడు ఆయన జీతం నెలకు 35 రూపాయలు. అందులో అప్పులు తీర్చడానికి అన్నకి కొంతమొత్తాన్ని పంపేవాడు. 1884లో దక్కన్​ ఎడ్యుకేషన్ సొసైటీ వారు న్యూ ఇంగ్లిష్ స్కూల్​ను ‘ఫెర్గ్యూసన్ కాలేజీ’గా మార్చి,1885లో గోఖలేను ప్రొఫెసర్​గా నియమించారు. అక్కడ ఇంగ్లిష్​, గణితం, చరిత్ర, పాలిటిక్స్ సబ్జెక్ట్స్ చెప్పేవాడు. 

ఆ స్కూల్ కార్యక్రమంలో జరిగిన ఓ సంఘటనతో ఆయనకు రనడేతో పరిచయం అయింది. ఆ తర్వాత రనడే గోఖలేను పూణె సార్వజనిక్​ సభకు కార్యదర్శుల్లో ఒకరిగా నియమించాడు. అప్పట్లో అది భారత రాజకీయ ముఖ్య సంస్థలలో ఒకటి. 1890లో గోఖలే మొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. 23 ఏటనే డిప్‌ పన్ను తగ్గించమని చేసే ఉద్యమానికి మద్దతుగా ప్రసంగించాడు. 

మొదటి భార్య చనిపోవడంతో బంధువుల బలవంతం వల్ల రెండో పెండ్లి చేసుకున్నాడు. దాంతో ఏకపత్నీవ్రతం బోధించే వాళ్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా వ్యతిరేకత కాస్తా ఉద్యమంగా మారింది. 1896లో  గోపాల్​, సర్ దిన్షావాచాతో పాటు వెల్బీ కమిషన్​ ముందు సాక్ష్యం ఇవ్వడానికి ఇంగ్లండ్​కు వెళ్లాడు. ఆ టైంలోనే ఇండియా పడమటి భాగంలో ప్లేగు వ్యాధి సోకింది.

 దీంతో గోఖలే స్నేహితులు అక్కడ పరిస్థితులకు మరికొన్ని జోడించి లేఖ రాశారు. దీంతో బొంబాయి గవర్నమెంట్​ మీద వ్యతిరేకంగా ఆరోపణలు చేశాడు. వాటిని నిరూపించడానికి ఇండియాకు తిరిగి వచ్చిన ఆయనకు నిజం తెలిసింది. బాగా ఆలోచించి బొంబాయి గవర్నమెంట్​కు క్షమాపణలు చెప్పాడు. అక్కడి అధికారులకు ఆయన మీద మంచి అభిప్రాయం ఏర్పడింది.

 తీవ్రవాదులు మరింత రెచ్చిపోయి పత్రికల్లో ఆయన గురించి నెగెటివ్​గా కథనాలు రాశారు. కానీ, వాటన్నింటినీ గోఖలే ఓపికగా భరించాడు. అప్పుడే ప్రభుత్వంవారు ప్లేగు వ్యాధి గురించి రీసెర్చ్, వ్యాక్సిన్​ల ప్రక్రియ కోసం ఒక కమిషన్​ను ఏర్పాటు చేసి అందులో మెంబర్​గా గోఖలేను నామినేట్ చేశారు. ఈ ప్రక్రియలో ఆయన ఇంగ్లాండ్​ వెళ్లొచ్చాడు. ఈ టైంలోనే ఆయన ఆలోచనా దృక్పథం మారిపోసాగింది. తర్వాత ఆయన తన ప్రెసిడెన్సీలోని సెంట్రల్​ డివిజినల్​ మున్సిపాలిటీ ద్వారా బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్​కు ఎన్నికయ్యాడు. అప్పుడే బొంబాయి గవర్నమెంట్ ఆయన ప్రెసిడెన్సీ మొత్తంలో కో– ఆపరేటివ్​ క్రెడిట్​ సొసైటీలను నెలకొల్పాడు. 

ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సర్​ ఫిరోజ్​ షా మెహతా వారసునిగా1902లో గోఖలే వచ్చాడు. ఈ పనుల్లోఆయన18 ఏండ్లు సేవలందించాడు. అప్పటికి ఆయన జీతం 75 రూపాయలు. అది కాదనుకుని రిజైన్ చేశాడు. 1905లో ‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ’ని ఏర్పాటుచేశాడు. ఈ సొసైటీ దేశం సేవ చేయడానికి సిద్ధమైన వాళ్లని ఒకచోట చేర్చింది. అది ఆయన ఉన్నంతకాలం బాగానే కొనసాగింది. 

గోఖలే ప్రభావం వల్లే 1908లో మింటో– మార్లే సంస్కరణలు వచ్చాయి. 1911లో ఆయనే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిల్ కూడా ప్రవేశపెట్టాడు. దక్షిణాఫ్రికాలో భారతీయుల తరఫున పోరాడుతున్న గాంధీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లాడు. ఆయన చొరవతో ఇండియన్ గవర్నమెంట్, మిస్టర్ స్మట్స్ ప్రతిపాదనలు అంగీకరించారు. కానీ, ఆ విజయాన్ని ఆయన చూడలేకపోయాడు. అప్పటికే డయాబెటిస్​తో బాధపడుతున్న ఆయన 1915లో ఫిబ్రవరి 19న తుదిశ్వాస విడిచాడు. 

- మేకల మదన్​మోహన్​ రావు, కవి, రచయిత-