అయోధ్య రాముడికి బంగారు 'రామాయణం' కానుక

అయోధ్య రాముడికి బంగారు 'రామాయణం' కానుక

ఉత్తర ప్రదేశ్‌లో కొలువైన అయోధ్య బాల రాముడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. అంతేకాదు అయోధ్య రాముడికి అదే రీతిలో కానుకలు వస్తున్నాయి. తాజాగా రాముడికి ఓ భక్తుడు రూ. 5 కోట్ల విలువ చేసే ఏడు కిలోల బంగారంపై రాసిన రామాయణాన్ని కానుకగా ఇచ్చారు. 500 బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధాన గర్భాలయంలో ఉంచారు.  అయోధ్యలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణ తన జీవిత కాలంలో సంపాదించిన మొత్తాన్ని బాల రాముడికి ఇస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసారు. ఆ మాట ప్రకారం రూ. 5 కోట్లు ఖర్చుతో 151 కిలోల బరువున్న రామచరిత రామాయణాన్ని తయారు చేశారు.  10, 902 శ్లోకాలతో ఈ బంగారు రామాయణానికి సంబంధించిన ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత పూశారు. మరోవైపు ఈ బంగారు రామాయణ తయారీలో దాదాపు 140 కిలోల రాగిని వినియోగించారు. 

కలశ స్థాపనతో నవమి వేడుకలు ప్రారంభం

అయోధ్యలో  శ్రీ రామ నవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అయోధ్యలో బాల రాముడు కొలువైన తర్వాత తొలిసారి శ్రీరామ నవమి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే అక్కడ  యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజామున 4:00 గంటలకు బాల రామయ్యకు జలాభిషేకం నిర్వహించి పూజలు నిర్వహించారు. ఆలయ గర్భగుడిలో వెండి కలశం ఏర్పాటు చేసి 11 మంది వేద పండితులు వాల్మీకి రామాయణంలోని నవః పారాయణం, రామ రక్షాస్త్రోత్, దుర్గా సప్తశతి పఠనం చేసి నవమి వేడుకలకు శ్రీకారం చుట్టారు.
మొదటి రోజు 2 లక్షల మంది భక్తులు సరయూ నదిలో స్నానమాచరించి బాలరామయ్యను దర్శించుకున్నారు. హనుమాన్ గర్హి లో పూజలు చేశారు. బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలిసారిగా స్వామివారి వస్త్రాల శైలిని మార్చినట్లు . శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చెప్పారు.అయోధ్యలో శ్రీరామనవమి రోజున రాముడిని దర్శించుకోవాడానికీ దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల  మంది  వరకు హాజరు కానున్నట్టు సమాచారం

త్రేతా యుగంలో 14 యేళ్లు వనవాసం చేసిన శ్రీరామచంద్రుడు.. ఈ కలియుగంలో తను పుట్టిన అయోధ్యలో కొలువు తీరడానికి ఐదు వందల యేళ్లు పోరాటాలు చేస్తే కానీ కొలువు తీరలేదు. మొత్తంగా సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రస్థానం జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠతో ముగిసింది. ఒక రకంగా ఈ కలియుగంలో జరిగిన అతిపెద్ద మహా క్రతువుగా అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠను చెప్పుకోవాలి.