కరోనాతో బుర్రలో గుజ్జు తగ్గుతోంది!

కరోనాతో బుర్రలో గుజ్జు తగ్గుతోంది!


న్యూఢిల్లీ: గ్రే మ్యాటర్​.. మెదడులో ఓ భాగం. ఇంకా చెప్పాలంటే మెదడులో ఎక్కువ మొత్తంలో ఉండే నల్లటి భాగం. మనం కదలాలన్నా, తినాలన్నా, జ్ఞాపకశక్తి బాగుండాలన్నా, మన ఎమోషన్​ను బయటకు చెప్పాలన్నా, ఏ పని చేయాలన్నా.. దాని నుంచి ఆదేశాలు రావాల్సిందే. మన శరీరం, మనసును ఎప్పటికప్పుడు బ్యాలెన్స్​ చేసే సెంట్రల్​ నర్వస్​ సిస్టమ్​ (కేంద్ర నాడీ వ్యవస్థ)కే మూలం అది. అలాంటి గ్రే మ్యాటర్​ను కరోనా తినేస్తోంది. కరోనా సోకి ఆక్సిజన్​ లేదా వెంటిలేటర్​ దాకా వెళ్లినోళ్లలో కొందరిలో మెదడు ముందు భాగంలోని నల్లటి పదార్థం తగ్గిపోతోంది. నరాల సంబంధ సమస్యలతో బాధపడుతున్న 120 మందిపై అమెరికాలోని జార్జియా స్టేట్​ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన పరిశోధనలో ఈ షాకింగ్​ విషయం వెల్లడైంది. అందులో 58 మందికి కరోనా ఉండగా, మిగతా 60 మందిలో కరోనా లేదు. 

వాళ్లకే ఎక్కువ రిస్క్​

కరోనా సోకి ఆక్సిజన్​ అవసరం పడిన వాళ్లు, వెంటిలేటర్​ దాకా వెళ్లిన వాళ్లలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని వక్​హార్డ్​ హాస్పిటల్​ న్యూరాలజిస్టు డాక్టర్​ పవన్​ పాయ్​ చెప్పారు. అంటే కరోనా వైరల్​ లోడ్​ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రభావం మెదడుపై పడుతుందన్నారు. మునుపే మెదడు సమస్యలున్నోళ్లలో కరోనా ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటోందని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెంటల్​ హెల్త్​ అండ్​ న్యూరోసైన్సెస్​ డైరెక్టర్​ డాక్టర్​ బీఎన్​ గంగాధర్​ తెలిపారు. హైబీపీ ఉన్నోళ్లు, లావుగా ఉన్నవాళ్లలోనూ గ్రే మ్యాటర్​ను కరోనా తగ్గించేస్తుందని చెప్పారు. మెదడు చిన్నగా ఉన్నవాళ్లలో దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందన్నారు. అలాంటి వాళ్లలోనే మానసిక సమస్యలు వస్తున్నాయని డాక్టర్​ పవన్​ పాయ్​ చెప్పారు. ఎప్పటికప్పుడు మూడ్స్​ కూడా మారిపోతుంటాయని వివరించారు. 

కరోనా ఒక్కటే కారణం కాకపోవచ్చు!

మ్యాక్స్​ హాస్పిటల్​కు చెందిన న్యూరాలజీ డిపార్ట్​మెంట్​ అసోసియేట్​ డైరెక్టర్​ డాక్టర్​ ముకేశ్​ కుమార్​ మాత్రం.. మెదడు గ్రే మ్యాటర్​ తగ్గిపోవడానికి కరోనా ఒక్కటే కారణం కాకపోవచ్చంటున్నారు. దీనిని నిర్ధారించేందుకు పెద్ద స్టడీలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నోళ్లు మానసికంగా సమస్యలు ఎదుర్కోవడం సహజమేనని చెప్పారు. ష్కీజోఫ్రీనియా, సైకోసిస్​, అబ్సెసివ్​ కంపల్సివ్​ డిజార్డర్​ (ఓసీడీ) ఉన్నవాళ్లలోనూ గ్రే మ్యాటర్​ తక్కువగా ఉంటుందన్నారు.

మంచిగ నిద్రపోవాలె

కరోనా నుంచి కోలుకున్న తర్వాత మానసిక సమస్యలు ఉన్నట్టు అనుమానం కలిగితే వెంటనే డాక్టర్​ దగ్గరకు పోవాలని పవన్ పాయ్​ సూచించారు. మెదడు ఆరోగ్యం బాగుండాలంటే కంటి నిండా నిద్రపోవాలని చెప్పారు. ‘‘రాత్రిపూట 8 నుంచి 9 గంటల పాటు నిద్రపోతే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడిని కట్టడి చేయాలి. బీపీ, షుగర్​లను కంట్రోల్​లో ఉంచుకోవాలి. రోజూ ఎక్సర్​సైజ్​ చేయాలి. రూబిక్​ క్యూబ్​, పజిల్స్​ వంటి వాటిని సాల్వ్​ చేస్తూ మెదడు శక్తిని పెంచుకోవాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే తిండి తినాలి. పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి’’ అని ఆయన సూచనలు చేశారు. 

15% మందిలో సమస్య

కరోనా సోకినవారిలో 15 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు స్టడీలో తేల్చారు. నిద్రపట్టకపోవడం, మెదడువాపు, స్ట్రోక్​, వాసన, రుచి కోల్పోవడం, కండరాలు, నరాల నొప్పులు, మూర్ఛ, గిలైన్​ బ్యారీ సిండ్రోమ్​, బ్రెయిన్​ ఫాగ్​, కన్ఫ్యూజన్​, మూడ్స్​ మారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు గుర్తించారు.