- 2050 నాటికి 32 కోట్ల వృద్ధులు.. పెరగనున్న కంటి సమస్యలు
- ఎల్వీ ప్రసాద్ సంస్థ నేతృత్వంలో నిపుణుల బృందం అధ్యయనం
- 2030 కల్లా అంధత్వ రహిత భారతే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్
- శుక్లాలే కాదు.. గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతిపైనా ఫోకస్ పెట్టాలి
- ఆశా, అంగన్‌వాడీలకు స్క్రీనింగ్‌లో శిక్షణ ఇవ్వాలి
- ఏఐ, టెలిమెడిసిన్‌తో పల్లెలకూ సేవలందించాలని సూచనలు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా భవిష్యత్తులో తలెత్తనున్న కంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు నిపుణులు పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. 2030కల్లా అంధత్వం లేని భారత్ లక్ష్యంగా వ్యూహాలు రూపొందించారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐఇన్‌స్టిట్యూట్(ఎల్వీపీఈఐ) నిపుణుడు డాక్టర్ తారాప్రసాద్ దాస్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా పలు సంస్థల డాక్టర్లు కలిసి స్టడీ చేసి, నివేదిక తయారు చేశారు.
ఈ స్టడీ రిపోర్ట్ ఇటీవల అంతర్జాతీయ మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో పబ్లిష్ అయింది. ప్రస్తుతం దేశంలో కంటి వైద్యం ఎలా ఉంది? భవిష్యత్తులో వచ్చే సమస్యలేంటి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలపై నిపుణులు ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఈ ప్లాన్ తయారు చేశారు.
ఇందుకోసం గత పదేళ్లలో జరిగిన పరిశోధనలను, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) రూల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య కంటి డాక్టర్ల అందుబాటు విషయంలో చాలా తారతమ్యాలు ఉన్నాయని ఈ స్టడీ బయటపెట్టింది.పెద్ద పెద్ద సిటీల్లో ప్రతి 10 లక్షల మందికి 12 మందికి పైగా కంటి డాక్టర్లు ఉంటే, పల్లెల్లో కేవలం ముగ్గురే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో డాక్టర్లు ఎక్కువ ఉంటే.. అండమాన్ లాంటి దీవుల్లో అసలు లేని పరిస్థితి ఉంది. 2030 నాటికి దేశ జనాభా 150 కోట్లు దాటే చాన్స్ ఉందని, అప్పటికి సుమారు 3 లక్షల కంటి ఆస్పత్రులు అవసరమని అంచనా వేశారు. ముఖ్యంగా 2050 నాటికి వృద్ధుల జనాభా 32 కోట్లకు చేరుతుందని, వారిలో వచ్చే కంటి సమస్యలను ఎదుర్కోవాలంటే ఇప్పుడే మేల్కోవాలని హెచ్చరించారు.
హైదరాబాద్ హోమ్స్ స్టడీయే ఆధారం..
ఈ జాతీయ స్థాయి ప్లాన్ తయారీలో హైదరాబాద్ సిటీ కీలకమైంది. ముఖ్యంగా వృద్ధుల కంటి సమస్యల పరిస్థితి తెలుసుకోవడానికి ఇక్కడ నిర్వహించిన హైదరాబాద్ హోమ్స్ స్టడీ నివేదికను నిపుణులు ప్రామాణికంగా తీసుకున్నారు. హైదరాబాద్ ఐ రీసెర్చ్ ఫౌండేషన్ ఇచ్చిన నిధులతో ఈ రీసెర్చ్ జరిగింది. ఇప్పటిదాకా మన దగ్గర కేవలం కంటి శుక్లాల ఆపరేషన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని, కానీ షుగర్ వల్ల వచ్చే కంటి జబ్బులు (డయాబెటిక్ రెటినోపతి), గ్లకోమాలాంటి వాటిపై కూడా ఫోకస్ పెంచాలని నిపుణులు సూచించారు.
- ఆశా, అంగన్‌వాడీలకు ట్రైనింగ్..
కంటి డాక్టర్ల కొరతను తీర్చడానికి నిపుణులు ఒక మంచి ఐడియా చెప్పారు. పల్లెల్లో ఉండే ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లకు కంటి పరీక్షలు (స్క్రీనింగ్) ఎలా చేయాలో ట్రైనింగ్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రాథమిక పరీక్షలు వారే చేయడం వల్ల డాక్టర్ల పై భారం తగ్గుతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్‌ఫోన్ల ద్వారా వీడియో కాల్స్ఉపయోగించి పల్లెటూరి వాళ్లకు కూడా నిపుణుల సలహాలు అందేలా చూడాలన్నారు.
ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాల ద్వారా పేదలకు ఫ్రీగా లేదా ఇన్సూరెన్స్ ద్వారా కంటి ఆపరేషన్లు జరిగేలా చూడాలని సూచించారు. మొత్తం 10 సూత్రాలతో కూడిన ఈ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తేనే దేశంలో ప్రతి కంటి సమస్యలను గణనీయంగా నివారించ వచ్చని నిపుణులు తేల్చి చెప్పారు.
