హార్మూజ్ దాటిన రెండు భారత ఎల్‌‌‌‌పీజీ నౌకలు

హార్మూజ్ దాటిన  రెండు భారత  ఎల్‌‌‌‌పీజీ నౌకలు
  •   గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంకర్లు
  •     ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రధాని మోదీ, జైశంకర్ చర్చలు సఫలం


న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్​తో భారత ప్రభుత్వం చేపట్టిన అత్యున్నత స్థాయి దౌత్య ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ)కి చెందిన ‘శివాలిక్’, ‘నందాదేవి’ అనే రెండు ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ ట్యాంకర్లు శనివారం హార్మూజ్ జలసంధిని దాటి ప్రస్తుతం మన దేశం వైపు వస్తున్నాయి. భారత నౌకల గురించి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. భారతీయ పౌరుల భద్రత, సరుకులు, ఇంధన రవాణాకు ఆటంకం కలగకుండా చూడాలని రిక్వెస్ట్ చేశారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఇరాన్ దౌత్యవేత్త సయ్యద్ అబ్బాస్ అరాఘీతో నాలుగు రౌండ్ల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు.

 ఈ చర్చలు ఫలించడంతో 'శివాలిక్', 'నందాదేవి' ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని దాటాయి. సుమారు 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రయాణిస్తున్న ఈ రెండు నౌకలు ఈ నెల16, 17 తేదీల్లో గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ముంద్రా, కాండ్లా ఓడరేవులకు చేరుకోనున్నాయి. జలసంధికి ఇరువైపులా చిక్కుకున్న మరో రెండు డజన్ల భారతీయ వాణిజ్య నౌకల సేఫ్​ జర్నీ కోసం కేంద్రం ప్రస్తుతం కృషి చేస్తోంది. ఇప్పటికే 'జగ్ ప్రకాశ్' అనే మరో ట్యాంకర్ కూడా సురక్షితంగా బయలుదేరినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కన్ఫామ్ చేసింది. కాగా.. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో హార్మూజ్ జలసంధిలో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఈ గల్ఫ్ ప్రాంతంలో దాదాపు 23 వేల మంది ఇండియన్లు వివిధ నౌకల్లో పనిచేస్తున్నారని అధికార వర్గాల సమాచారం.