
- సీఎంకు సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో విజ్ఞప్తి
- గవర్నర్ కార్యాలయంలోనూ వినతిపత్రం
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సోమవారం గజ్వేల్ కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట, గజ్వేల్ నుంచి పాదయాత్రగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదని, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని నర్సారెడ్డి ఆధ్వర్యంలో సీఎంకు వినతిపత్రం అందజేశారు. అలాగే రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు కూడా ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, నాచారం టెంపుల్ మాజీ చైర్మన్ లక్ష్మీనర్సింహులు గౌడ్ పాల్గొన్నారు.
‘దళిత గిరిజన దండోరా’ గుర్తుకొచ్చింది: సీఎం
గజ్వేల్ నియోజకవర్గం నుంచి నర్సారెడ్డి సారథ్యంలో వందలాది మంది పాదయాత్రగా వచ్చి కలిశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పాదయాత్రకు వచ్చే ప్రజలను చూస్తే ఆనాడు గజ్వేల్ గడ్డపై చేసిన ‘దళిత - గిరిజన దండోరా’ గుర్తుకు వచ్చిందని పేర్కొన్నారు. తమ శాసనసభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి హాజరు కాకపోవడం వల్ల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలు సభలో ప్రస్తావనకు రాని పరిస్థితిపై ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రజా సమస్యలపై నర్సారెడ్డి బాధతో, బాధ్యతతో వ్యవహరిస్తున్న తీరు అభినందనీయమన్నారు. గజ్వేల్ పై తనకు ప్రత్యేక అభిమానం ఉందని, ఆ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.