ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మందమర్రి/నస్పూర్/బెల్లంపల్లి, వెలుగు: సింగరేణి  కాంట్రాక్ట్​ కార్మికులకు హైపవర్​ వేతనాలు చెల్లించాలని, ఇతర డిమాండ్లను పరిష్కారించాలని కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. శనివారం బెల్లంపల్లి రీజియన్​ పరిధిలోని మందమర్రి, శ్రీరాంపూర్​, రామకృష్ణాపూర్​, బెల్లంపల్లి ప్రాంతాల్లో వేలాది కాంట్రాక్ట్​ కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి జీఎం ఆఫీస్​, మందమర్రిలోని సింగరేణి సివిక్​ ఆఫీస్​లను వేర్వేరుగా కార్మికులు ముట్టడించి ధర్నాలు చేపట్టారు. మందమర్రిలోని సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​ నుంచి సివిల్​ ఆఫీస్​ వరకు, రామకృష్ణాపూర్​లోని సింగరేణి సివిల్​ ఆఫీస్​ నుంచి బిజోన్​ చౌరస్తా వరకు ర్యాలీలు చేపట్టారు. సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఇప్టూ లీడర్లు రామడుగు లక్ష్మణ్​,  మిట్టపెల్లి శ్రీనివాస్​, మేకల దాసు, ఎండీ.అక్బర్​అలీ, సలెంద్ర సత్యనారాయణ తదితరులు మద్దతు పలికారు. 
 
బెల్లంపల్లి పట్టణంలో..
కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్ టీయూ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎండీ. చాంద్ పాషా, టీఎన్ టీయూసీ స్టేట్ సెక్రటరీ టి. మనిరామ్ సింగ్ లు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిక్ ఆఫీస్​నుంచి కాంటా  చౌరస్తా వరకు శనివారం కాంట్రాక్టు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. 

అడ్వకేట్లు, జడ్జిలు కోఆర్డినేషన్​తో పనిచేయాలి
 జస్టిస్ ఎ. వెంకటేశ్వరరెడ్డి

బెల్లంపల్లి, వెలుగు: ‘న్యాయ వ్యవస్థ జోడెద్దుల బండి’ అని అడ్వకేట్లు, జడ్జిలు పరస్పర సహకారంతో పనిచేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని  హైకోర్టు  జడ్జి జస్టిస్ ఎ.వెంకటేశ్వరరెడ్డి అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల హైవేలో రూ.5 కోట్లతో  నిర్మించనున్న జూనియర్ సివిల్ కోర్టు బిల్డింగ్ పనులను ఆయన  శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక తిరుమల ఫంక్షన్ హాలులో  ఏర్పాటు చేసిన మీటింగ్​లో జడ్జి మాట్లాడారు. రాష్ట్రంలో 9 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయని వాటి పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.  బెల్లంపల్లి మున్సిఫ్ కోర్టులో 3,500 పెండింగ్ కేసులు ఉన్నాయని ఇక్కడ ఫస్ట్ అడిషనల్ కోర్టు, సబ్ కోర్టులు  ఏర్పాటు చేయాలని సీనియర్ అడ్వకేట్​గోపికిషన్ సింగ్ ఠాకూర్ జడ్జిని కోరారు. జిల్లా కోర్టు చీఫ్​జస్టిస్ సత్తయ్య, బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి జి. హిమబిందు, డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్​నాయక్, ఆర్డీవో శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.  

బస్సు రాగానే .. బడిపిల్లలు ఇంటికి..

దహెగాం, వెలుగు: స్కూల్ టైమ్​తో పని లేకుండా బస్సు ఎప్పుడు వస్తే  అప్పుడే  స్కూల్​ నుంచి పిల్లలను వదిలేస్తున్నారు. ఇలాగైతే చదువు ఎలా వస్తుందని కొంచవెల్లి ఎంపీటీసీ  గౌరె  రాకేశ్ జనరల్ బాడీ  మీటింగ్​లో ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ కంభగౌని సులోచన అధ్యక్షతన శనివారం జరిగిన మండల సమావేశానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హాజరయ్యారు. ఎంఈవో భిక్షపతి మాట్లాడుతుండగా, కొంచవెల్లి ఎంపీటీసీ, మొట్లగూడ సర్పంచ్ జిల్లడ వెంకటేశ్​ బడులు స్టార్ట్​ అయ్యి మూడు నెలలైనా స్కూల్ యూనిఫామ్ ఇవ్వలేదని, టీచర్లు లేటుగా వస్తున్నారని, బస్సు ఎప్పుడొస్తే అప్పుడే సెలవు ఇచ్చి వెళ్లిపోతున్నారని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే వివరణ కోరగా, గతంలో కూడా కంప్లైంట్ వచ్చిందని బయోమెట్రిక్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎంఈవో చెప్పారు. యూనిఫామ్ క్లాత్  త్వరలోనే అందిస్తామన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీతో పాటు పలు పంచాయతీల్లో మిషన్​భగీరథ నీళ్లు రావడంలేదని సర్పంచులు ఆరోపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జడ్పీటీసీ  రామారావ్​, రైతుబంధు కన్వీనర్​ సంతోష్​ గౌడ్​, తహసీల్దార్​ రామ్మోహన్​రావ్ పాల్గొన్నారు.

భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

కుభీర్, వెలుగు: భర్త, అత్తింటివారి బంధువుల వేధింపులు భరించలేక మండలంలోని పాంగ్ర గ్రామానికి చెందిన పూజేకార్  సునీత(35) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎండీ. షరీఫ్ తెలిపారు. భైంసా మండలం మచకల్ గ్రామానికి చెందిన సునీతకు పాంగ్ర గ్రామానికి చెందిన భూమేశ్​తో 20 ఏళ్ల కింద పెళ్లైంది. మృతురాలి తండ్రి దత్త హరి కంప్లైంట్​ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సునీత ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని భైంసా బస్టాండ్ ముందు రోడ్డుపై కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించారు. భైంసా రూరల్​ సీఐ చంద్రశేఖర్ అక్కడికి చేరుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో శాంతించారు.

చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల, నస్పూర్​పట్టణాలలో ఇటీవల చోరీలకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.  డీసీపీ అఖిల్​ మహాజన్ వివరాల ప్రకారం.. భూపాలపల్లిలోని కారల్​మార్క్స్​కాలనీకి చెందిన దొరిశెట్టి స్వామి నిరంజన్​ (33) ‘హోటల్​మేనేజ్​మెంట్’​ చేసి కొంత కాలం హోటల్​ బిజినెస్​ చేశాడు. జల్సాలు అలవాటై అప్పులు పెరిగి దొంగతనాలకు పాల్పడుతున్నాడు.  ఇటీవల నస్పూర్​లోని నాగార్జున కాలనీకి చెందిన తన ఫ్రెండ్​ ఆవునూరి రాహుల్​ ఇంట్లో షెల్టర్​ తీసుకొని ఈ నెల 7న మంచిర్యాల చున్నంబట్టివాడలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. శనివారం ఉదయం ముఖరం చౌరస్తా ఏరియాలో దొంగిలించిన ఆభరణాలను అమ్మేందుకు తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు, రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. అతడికి సహకరించిన ఆవునూరి రాహుల్​ పరారీలో ఉన్నాడని డీసీపీ చెప్పారు.  

మా పిల్లలు గోసపడుతుండ్రు సారూ..

కాగజ్ నగర్, వెలుగు: ‘మా పిల్లలు  సోషల్​ వెల్ఫేర్​హాస్టల్​లో పురుగుల అన్నం, సౌలత్​ల లేమితో సతమతమైతుండ్రు సారు’ అని స్టూడెంట్ల తల్లిదండ్రులు అడిషనల్​ కలెక్టర్ రాజేశంకు వివరించారు. శనివారం సిర్పూర్​(టీ)లోని సోషల్​వెల్ఫేర్​బాలికల హాస్టల్​ను అడిషనల్​ కలెక్టర్​విజిట్​చేశారు. ఇదే సమయంలో రెండో శనివారం కావడంతో స్టూడెంట్ల తల్లిదండ్రులు హాస్టల్​కు వచ్చారు. ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​ను కలిసి పిల్లల అవస్థలు చెప్పారు. పిల్లల బాధలు చెప్తుంటే దుఃఖమొస్తుందని ఇలాగైతే పిల్లలను హాస్టల్​లలో ఎలా ఉంచాలని ప్రశ్నించారు.  విద్యార్థులకు ఇబ్బంది  లేకుండా చర్యలు తీసుకుంటానని అడిషనల్​ కలెక్టర్​ రాజేశం 
స్టూడెంట్ల తల్లిదండ్రులకు చెప్పారు. 

డిగ్రీ కాలేజీని విజిట్ ​చేసిన జడ్పీ చైర్​పర్సన్

ఆసిఫాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలోని ఎస్టీ గర్ల్స్​ డిగ్రీ కాలేజీ ని జడ్పీ చైర్​ పర్సన్​ కోవ లక్ష్మి సందర్శించారు.  ‘జ్వరాలతో స్టూడెంట్లు చస్తున్నా.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు’  అని శనివారం  పబ్లిష్​ అయిన ‘వెలుగు’ కథనానికి   స్పందించారు. హాస్టల్​లో ఇటీవల జ్వరంతో డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్   సంగీత మృతి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంటి గదిని పరిశీలించారు. స్టూడెంట్ల కు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు.  

ప్రధానిని విమర్శించే స్థాయి మంత్రికి లేదు

నిర్మల్, వెలుగు:  దేశప్రధాని మోడీని విమర్శించే స్థాయి మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డికి లేదని, సీఎం మెప్పు కోసం విమర్శలు చేయడం సరికాదని బీజేపీ సీనియర్​ లీడర్​ వినాయక్​రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ ప్రతిరోజు18 గంటలు ప్రజలతో ఉండి పని చేస్తున్నారని, సీఎం 365 రోజుల్లో 30 రోజులు కూడా ప్రజల్లో ఉండడం లేదని విమర్శించారు. దళితబంధు స్కీమ్​ను ఇప్పటి వరకు ఎంత మందికి అందించారని ప్రశ్నించారు. ప్రజలు త్వరలోనే కేసీఆర్​కు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

పల్లవి హాస్పిటల్​లో అరుదైన చికిత్స

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జన్మభూమి నగర్​లోని పల్లవి హాస్పిటల్​లో అరుదైన ఆర్ద్రోస్కోపీ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ బొల్లబత్తిని రాజు తెలిపారు. శ్రీరాంపూర్ కృష్ణకాలనీకి చెందిన బి.సదయ్య(40) నెల రోజుల నుంచి మోకాలు చిప్ప లోపల గల కీలు నరం సమస్యతో బాధపడుతూ నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఆయనకు కీ హోల్ పద్ధతి ద్వారా ఆర్ద్రోస్కోపీ ఆపరేషన్ నిర్వహించగా పూర్తిగా కోలుకున్నాడని తెలిపారు. ఇప్పటివరకు ఈ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు పల్లవి హాస్పిటల్లోనే తక్కువ ఫీజుతో అందిస్తున్నామని చెప్పారు. ప్రెస్​మీట్​లో పిల్లల వైద్యనిపుణులు సాయిశ్రుతి, హాస్పిటల్ నిర్వాహకులు నవీన్ పాల్గొన్నారు.

వాగులో పడి యువకుడు మృతి 

కుభీరు, వెలుగు: మండల కేంద్రానికి చెందిన  దెవకర్​ఆనంద్(22) అనే యువకుడు వాగులో పడి చనిపోయాడు. ఎస్సై ఎండీ షరీఫ్ వివరాల ప్రకారం.. ఆనంద్ గ్రామ శివారు వాగులో శనివారం గణేశ్​నిమజ్జనం కోసం వెళ్లి మద్యం మత్తులో బట్టలు విప్పేసి వాగులో దిగాడు. ఈత రాకపోవడంతో వాగులో మునిగిపోయాడు. అక్కడ ఉన్నవారు గమనించి ఆనంద్​ను బయటకు తీసి భైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. తండ్రి రామారావు కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  తెలిపారు.