
రామకృష్ణాపూర్, వెలుగు: ఇటీవల కురిసిన వర్షానికి మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ఓసీపీలో భారీగా మట్టి బెంచీలు(బొగ్గు ఉత్పత్తి కోసం మట్టిని తీసేందుకు రెడీ చేసిన ప్రాంతం) కూలిపోయాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా సింగరేణి జాగ్రత్తపడగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓసీపీలోని సౌత్వెస్ట్సైడ్లో గత నెల 22న సుమారు 100 మీటర్ల ఎత్తు, అర కి.మీ పొడవున మట్టి బెంచీలు స్లైడింగ్ అయ్యాయి. బెంచీలు కూలిపోవడంతో అక్కడే ఉన్న పంప్స్టేషన్(పంపులు, కేబుల్స్, స్టార్టర్లు, స్వీచ్‌లు, వాటర్ సంప్) పూర్తిగా మునిగిపోయింది.
పంప్ స్టేషన్‌లోని నీళ్ల సంపు మునిగి అందులోని నీళ్లన్నీ పైకి వచ్చి సమీపంలో బొగ్గు ఉత్పత్తి పనులు చేపట్టిన మహాలక్ష్మి ఓబీ కాంట్రాక్ట్ సంస్థకు కేటాయించిన స్థలంలోకి చేరాయి. దీంతో సదరు కంపెనీ కూడా పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. నీటిని తొలగించి బెంచీలను యథాస్థితికి తీసుకొచ్చేందుకు మరో నాలుగు నెలల టైమ్ పట్టే చాన్స్ ఉంది. దీంతో సింగరేణి సంస్థ అక్కడ పనిచేసే ఉద్యోగుల్ని వేరొక చోటుకు బదిలీ చేసే ప్రయత్నంలో ఉంది. మరోవైపు సదరు కాంట్రాక్ట్ కంపెనీకి మరో స్థలాన్ని కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గనిలో 90శాతం ఓబీ వెలికితీత, బొగ్గు ఉత్పత్తి పనులను ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థ నిర్వహిస్తుండగా.. మిగిలిన పది శాతం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది.
ఉద్యోగుల్లో భయం..
ఆర్కేపీ ఓపెన్‌కాస్ట్ గనిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ భయం పట్టుకుంది. గనిలో పనులు లేవంటూ సిబ్బందిని బలవంతంగా ఇతర ప్రాంతాలకు పంపేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. ఈ గనిలో ఆపరేటర్లు, ఎలక్ర్టిషియన్లు సుమారు 150 మంది పనిచేస్తుండగా.. వీరందరినీ మరో రెండు, మూడు రోజుల్లో ట్రాన్స్ఫర్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా, గని పీవో, సేఫ్టీ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణంగానే బెంచీల స్లైడింగ్ సమస్య వచ్చిందని , ఉద్యోగులను మందమర్రి ఏరియాలోనే సర్దుబాటు చేయాలని ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఎండీ అక్బర్ అలీ డిమాండ్ చేశారు.